కడప జిల్లా మామిళ్ల పల్లిలో జరిగిన ముగ్గురాయి గనుల్లో పేలుడు ఘటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీప బంధవు వైఎస్ ప్రతాప్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన దగ్గర నుంచి జిలెటిన్ స్టిక్స్.. ముగ్గురాళ్ల గనికి వెళ్లాయి. నిజానికి ఆ గని ఆయనది కాదు. కానీ వైఎస్ ప్రతాప్ రెడ్డికి కడపలో చాలా గనులు ఉన్నాయి. వాటిలో వినియోగించుకోవడానికి ఆయనకు జిలెటిన్ స్టిక్స్ కొనే లైసెన్స్ ఉంది. తన కోసం కొనుగోలు చేసిన జిలెటిన్ స్టిక్స్‌ను అక్రమంగా.. మామిళ్లపల్లి ముగ్గురాయి గనుల్లో పేలుడు కోసం పంపించారు.
ఇందు కోసం కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. ఈ తప్పిదానికి పాల్పడినందుకు ఆయనను పోలీసులు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి దగ్గరి బంధువును.. పేలుళ్ల కేసులో అరెస్ట్ చేయడం… రాజకీయంగానూ కలకలం రేపుతోంది. నిజానికి ముఖ్యమంత్రి కన్నా… వైఎస్ ప్రతాప్ రెడ్డి..కడప ఎంపీ అవినాష్ రెడ్డికి దగ్గరి బంధవు. వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రికి అన్న వైఎస్ ప్రతాప్ రెడ్డి. అంటే ఎంపీకి పెదనాన్న. నిజానికి వైఎస్ ఫ్యామిలీలో వైఎస్ ప్రతాప్ రెడ్డికి.. ఇతరులకు మధ్య కొంత గ్యాప్ ఉందన్న ప్రచారం ఉంది.
వైఎస్ కుటుంబ అంతర్గత విషయాలు ఎవరికీ పెద్దగా తెలియదు కానీ… వైఎస్ వివేకా హత్య తర్వాత మాత్రం.. అనేకానేక ప్రచారాలు వెలుగులోకి వచ్చాయి. అందుకే వైఎస్ ప్రతాప్ రెడ్డి అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు మరింత కలకలం రేపుతోంది. అయితే కేసులో జిలెటిన్ స్టిక్స్ ఎక్కడి నుంచి వచ్చాయో కనిపెట్టారు కాబట్టి అరెస్ట్ చేశారా.. లేక నిజంగానే కుటుంబ రాజకీయాలు పని చేశాయా.. అన్నదాన్ని.. అరెస్ట్ రియాక్షన్స్ బట్టి అర్థం చేసుకోవచ్చని… కొంత మంది అంచనా వేస్తున్నారు.