కేంద్రం నుంచి టీకాలు వచ్చే అవకాశాలు కనిపించకపోవడం..కేంద్రం ఇచ్చేది కూడా.. అరకొర కావడంతో రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్‌కు సొంత బాట ఎంచుకుంటున్నాయి. కేంద్రంపై నమ్మకం పెట్టుకోవడం తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాయి. కేంద్రం పట్టించుకోకపోయినా ప్రజల గురించితాము పట్టించుకోవాల్సిన పరిస్థితి ఉందని.. నిర్ణయించుకున్నాయి. గ్లోబల్ టెండర్లకు వెళ్లి అయినా వ్యాక్సిన్ డోస్‌లు కొనుగోలు చేసి ప్రజలకు వేయించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా వంటి రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లు పిలిచేశాయి. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన సంస్థలు… టీకాలను ఇచ్చేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఫైజర్, జైడస్ సహా టీకాలను అభివృద్ధి చేసి.. పంపిణీ చేస్తున్న సంస్థలన్నీ … ఇండియాకు డోసులు ఇచ్చేందుకు పోటీ పడే అవకాశం ఉంది.
తాము కూడా గ్లోబల్ టెండర్లకు వెళ్లాలని… తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఏపీ సీఎంజగన్మోహన్ రెడ్డి కూడా.. అధికారులకు ఇదే సూచన చేశారు. ఇతర రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లకు వెళ్తున్న విషయాన్ని అధ్యయనం చేసి.. తాము కూడా అంతర్జాతీయమార్కెట్లో కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఏపీలో వ్యాక్సిన్లపై ఎక్కువగా రాజకీయం జరుగుతోంది. ప్రజల ప్రాణాల్ని గాలికొదిలేసి.. డబ్బులు పెట్టి కొనుగోలు చేయడం లేదని… విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 22 నెలల్లో ప్రతి కుటుంబానికి రెండు లక్షల వరకూ నగదు పంపిణీ చేసిన తమ ప్రభుత్వానికి.. రూ. పదహారు వందల కోట్లు ఖర్చు చేయడం పెద్ద విషయం కాదని.. కానీ కొనడానికి టీకాల్లేవని ప్రభుత్వం చెబుతోంది. ఇలా రాష్ట్రాలన్నీ ఎవరికి వారు గ్లోబల్ టెండర్లకు వెళ్లడం.. వల్ల కేంద్ర ప్రభుత్వానికి భారం తగ్గుతుంది కానీ.., బాధ్యతను మర్చిపోయినట్లుగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
టీకాల విషయంలో ప్రజల బాధ్యతలు చూసుకోవాల్సిన ప్రభుత్వం ఆర్థిక కారణాలతో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించి… చివరికి రాష్ట్ర ప్రభుత్వాల దయకు వదిలేసిందనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే.. కేంద్రంపై రాష్ట్రాలు నమ్మకం కోల్పోతున్నట్లే. కేంద్రంలో అధికారంలో ఉన్నపార్టీగా.. రాష్ట్రాల అధికారాల్ని లాక్కోవడానికి ఏం చేయడానికైనా వెనుకాడని పార్టీగా ఉన్న బీజేపీ.. ఆయారాష్ట్రాల్లో విపత్తులు సంభవించిన సమయంలో మాత్రం నిమిత్తమాత్రంగా వ్యవహరిస్తూ… చేటు చేస్తోందన్న అభిప్రాయాలు నిపుణుల నుంచి వస్తున్నాయి. ఎన్ని అభిప్రాయాలు వచ్చినా.. ఎలాంటి ముద్ర పడినా… కేంద్ర పెద్దలు డోంట్ కేర్.