నేను పరీక్ష పాసైతే.. పక్కోడి గుండు కొట్టిస్తా.. అని మొక్కుకోవడం.. కామెడీగా ఉంటుంది. ఇలాంటి కామెడీలు చేయడంలో… ఏపీ మంత్రులు తీసిపోవడం లేదు. ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రూ. వంద కోట్ల విరాళాన్ని .. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వానికి చెందిన అన్ని విభాగాల మీడియా రిలేషన్స్ బాధ్యతలు చూసేవారు పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేశారు. అయితే..ఆహా.. పెద్దిరెడ్డి ఎంత గొప్ప వ్యక్తి .. వంద కోట్లిచ్చారు అని ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే ఆయన విరాళం ఇచ్చింది.. ఆయన సొమ్ము కాదు. ఆయన మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ నిధులు. సంస్థ నిధులు… ప్రధాన ఖాతా నుంచి రూ. పది కోట్లు.. జిల్లాల నుంచి మరో రూ.90కోట్లు సీఎంఆర్ఎఫ్కు విరాళం ఇస్తూ.. పెద్ద పెద్ద చెక్కులు సమర్పిస్తూ ఫోటోలు దిగారు.
అది ప్రభుత్వ ధనమే..సీఎంఆర్ఎఫ్ కూడా.. ప్రభుత్వానిదే. అంటే ప్రజాధనాన్ని ప్రభుత్వానికి ఇచ్చారన్నమాట. సీఎంఆర్ఎఫ్.. అనేది ముఖ్యమంత్రి విచక్షణ మేరకు ఎవరికైనా సాయం చేయడానికి ఉద్దేశించిన నిధి. కరోనా మొదటివేవ్ సమయంలో… పెద్ద ఎత్తున విరాళాలు వచ్చాయి. పీఎంకేర్స్ తరహాలోనే ప్రభుత్వానికీ విరాళాలొచ్చాయి. వాటిని వేటికి ఖర్చు పెట్టారో తెలియదు. ఆరోగ్యశ్రీ అన్ని వ్యాధులకూ వర్తింప చేశామని.. ఆ జాబితాలో ఉన్న వాటికి.. సీఎంఆర్ఎఫ్ కింద సాయం ఇవ్వబోమని.. ఇప్పటికే ప్రభుత్వం తేల్చేసింది. అయితే.. అనూహ్యంగా ఓ సందర్భంగా… సీఎంఆర్ఎఫ్ నుంచి దొంగ చెక్కులతో క్లియరెన్స్ కోసం ప్రయత్నిస్తూ.. దొరికిపోయారు. ఇతర రాష్ట్రాల్లో ఆ చెక్కులు జమ అయ్యాయి. అయితే అప్పటికే సీఎంఆర్ఎఫ్ అకౌంట్లో పెద్ద మొత్తం లేదన్న వార్తలు వచ్చాయి. అంటే అప్పటికే కరోనా సహాయ చర్యలకు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టేశారన్నమాట.
ఇప్పుడు మళ్లీ..సెకండ్ వేవ్.. ఉచిత వ్యాక్సిన్ కోసం.. విరాళాల సేకరణచేయాల్సి వచ్చింది. ఉద్యోగుల ఒక నెల జీతాన్ని తీసుకుందామని ప్లాన్ చేసినా వారి నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో.. ఇతర ఆదాయార్జన శాఖల నుంచి… సీఎంఆర్ఎఫ్కు విరాళాలు సేకరించాలని నిర్ణయించినట్లుగా ఉన్నారు. ముందుగా పెద్దిరెడ్డి..తన వంతుగా వంద కోట్లు జమ చేసేశారు. నిజానికి పెద్దిరెడ్డి మల్టీమిలియనీర్.. ఆయనకు ఉన్న ఆస్తులు.. వ్యాపారాలు..వేల కోట్లలోనే ఉంటాయి. కానీ.. ఆయన వ్యక్తిగతంగా ఇంత వరకూ ఎప్పుడూ పైసా కూడా.. దానం చేసినట్లుగా బయట ప్రపంచానికి తెలియదు. తనది కాని సొమ్మును మాత్రం ఆయన దానకర్ణుడిలా సమర్పించేశారు.