చంద్రబాబుపై ఓ వంద కేసులను నమోదు చేయాలన్న టార్గెట్‌గా ఏపీ సర్కార్ పెట్టుకున్నట్లుగా ఉంది. వైరస్ గురించి చెప్పి భయపెట్టారని.. కర్నూలులో వైసీపీకి చెందిన ఓ లాయర్ ఫిర్యాదు చేయగా.. అఘమేఘాలపై క్రిమినల్ కేసులు పెట్టి.. నేడో రేపో అరెస్టన్నంతగా హడావుడి చేసిన పోలీసులు ఎందుకో కానీ చివరి క్షణంలో వెనక్కి తగ్గారు. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి.. చంద్రబాబుపై కేసులు పెట్టాలని బహిరంగంగా తమ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. అనధికారిక హోంమంత్రిగా .. పోలీసు వ్యవస్థపై పూర్తి పట్టు సాధించిన వ్యక్తిగా ఉన్న సజ్జల పిలుపునివ్వడంతో.. ఆయనకు వీరతాళ్లు వేయాలనుకునేవాళ్లు ఊరుకుంటారా..? రంగంలోకి దిగారు. అయితే సెలక్టివ్‌గా ఫిర్యాదులు ఇప్పించడం ప్రారంభించారు.
ముందుగా గుంటూరులో ఓ ఫిర్యాదు ఇప్పించారు. తర్వాత నరసరావుపేటలో మరో ఫిర్యాదు ఇప్పించారు. నిన్నటికి రెండు కేసులు అయ్యాయన్నమాట. ఈఫిర్యాదులు.. కేసులు పరంపర అంతటితో ఆగబోదు… దాదాపుగా ప్రతి నియోజకవర్గంలోనూ చంద్రబాబుపై ఫిర్యాదు చేయడం.. కేసులు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తంగా.. ఓ వంద కేసులైనా చంద్రబాబుపై నమోదు చేస్తారని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇతర టీడీపీ నేతల్లా..ఏదో విధంగా అరెస్ట్ చేసి.. కొద్ది రోజులు అయినా జైల్లో ఉంచాలన్న పాలక పెద్దల ఆలోచన ఎలాగైనా నేరవేర్చేందుకు ఇవి ఉపయోగపడతాయన్న అంచనాలో వైసీపీ నేతలు ఉన్నట్లుగా చెబుతున్నారు.
సమాచారాన్ని షేర్ చేసుకుంటే… నేరం కాదని.. అలాంటి వాటిపై కేసులు పెడితే… పోలీసులపై చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసినప్పటికీ… చంద్రబాబు భయపెట్టారంటూ… కేసులు నమోదు చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పోలీసులు సాధారణంగా ఇలాంటికేసులు నమోదు చేయరు. కానీ.. ఇప్పుడుపరిస్థితి వేరు. వారు పూర్తిగా పై నుంచి వచ్చే ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది. మొత్తానికి త్వరలోనే జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసుల కన్నా ఎక్కువ కేసులు.. చంద్రబాబుపై ఉండే అవకాశం ఉంది.