తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీతో ఇక బంధం చెల్లిపోయిందన్న దశలో ఉన్న ఈటల రాజేందర్ రాజకీయ అడుగులు అనూహ్యంగా ఉంటున్నాయి. ఆయన .. హఠాత్తుగా టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్కతో సమావేశమయ్యారు. స్వయంగా భట్టి విక్రమార్క ఇంటికి వెళ్లిన ఈటల.. చాలా సేపు రాజకీయాలు చర్చించారు. ఏం చర్చించారో.. రాజకీయ నేతలు సహజంగానే వెల్లడించరు… అందుకే.. రాజకీయాలు చర్చించలేదని.. తెలంగాణలోని పరిస్థితుల్ని చర్చించామని చెప్పుకొచ్చారు. కానీ వారు రాజకీయాలు చర్చించలేదంటే ఎవరూ నమ్మరు. ఈటలే వచ్చి కలిశారు కాబట్టి.. మల్లు భట్టి విక్రమార్క.. ఆయనను కాంగ్రెస్లోకి ఆహ్వానించి ఉంటారని ఓ వర్గం చెబుతోంది.
అయితే.. టీఆర్ఎస్ను ఎదుర్కోవాలంటే ఇప్పుడు .. గతంలో కేసీఆర్ చెప్పినట్లుగానే రాజకీయ పునరేకీకరణ సూత్రమే కరెక్ట్ అని.. కేసీఆర్కు వ్యతిరేకంగా అందరూ ఏకమయితేనే.. సాధ్యమని.. నచ్చ చెప్పి.. భట్టి విక్రమార్కను కూడా..తన ఫోల్డ్లోకి తీసుకుని వచ్చేందుకు ఈటల ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఈటల.. తనపై కేసీఆర్ అనర్హతా వేటు వేసినా వేయకపోయినా.. తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ.. ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ముందుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నారు. అందుకే ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నారు.
బర్తరఫ్ తర్వాత కొండా విశ్వేశ్వర్ రెడ్డి లాంటి నాయకులు ఇంటికి వెళ్లి ఆయనకు సానుభూతి తెలిపారు. వివిధ కుల సంఘాలు ఆయనకు మద్దతు తెలిపారు. దాంతో పాటు స్వయంగా తాను ముండుగు వేసి.. మరింత మద్దతు సమీకరించుకుంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్లో ఉంటూ.. టీఆర్ఎస్ చెప్పినట్లుగా తనపై ఆరోపణలు చేస్తున్న హుజూరాబాద్ నేత కౌశిక్ రెడ్డి అంశాన్ని కూడా ఈటల …భట్టితో చర్చించినట్లుగా చెబుతున్నారు. ఈటలకు పోటీగా.. కౌశిక్ రెడ్డిని బరిలోకి దించాలని టీఆర్ఎస్ పెద్దలు ప్లాన్ చేస్తున్నట్లుగా ఇప్పటికే ప్రచారం జరుగుతోంది.