లాక్డౌన్ ప్రకటించిన తెలంగాణ సర్కార్.. గత ఏడాది లాక్ డౌన్ సమయంలో జరిగిన తప్పులను చేయకుండా జాగ్రత్తలు తీసుకుంది. గత ఏడాది లాక్ డౌన్ సమయంలో హాస్టల్స్‌ను మూసివేయడంతో పాటు… రూ. ఐదు భోజన కేంద్రాలైన అన్నపూర్ణ కేంద్రాలను మూసివేసింది. దీంతో అనేక మంది భోజనానికి ఇబ్బందులు పడ్డారు. ఓ వైపు హోటల్స్ మూసివేత.. మరో వైపు ఎక్కడా దొరని ఆహారం పరిస్థితుల్లో ఆకలి బాధలకు గురయ్యారు. ఈ క్రమంలో చాలా మంది.. ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో గందరగోళం ఏర్పడింది. చివరికి సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం రూ. ఐదు రూపాయల భోజనాన్ని… మళ్లీ కొనసాగించాలని నిర్ణయించింది.
అంతే కాదు.. ఐదు రూపాయలు కూడా తీసుకోకుండా ఉచితంగా ఇచ్చింది. ఈ ఏడాది కూడా అదే నిర్ణయం తీసుకుంది. అన్నపూర్ణ భోజన కేంద్రాల్లో లాక్ డౌన్ కాలం మొత్తం ఉచితంగా భోజనం అందించాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లో రోజు కూలీలు.. చిరు వ్యాపారులు.. ఫుట్ పాతే జీవనంగా గడిపేవారు.. మార్కెట్లలో పని చేసి పొట్ట పోసుకునేవారు పెద్ద సంఖ్యలో ఉంటారు. వారందరికీ.. అన్నపూర్ణ భోజన కేంద్రాలు.. ఆకలి తీర్చే దేవాలయాలు.ప్రతీ రోజూ .. పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ భోజనం అందుబాటులో ఉంచుతారు.
లాక్ డౌన్ కారణంగా.. ఇప్పుడు వీటిని మూసేస్తే.. కొన్ని వేల మంది ఆకలితో నకనకలాడుతారు. అలాంటి పరిస్థితి ఉండకూడదని తెలంగాణ సర్కార్ భావించింది. పనులు కూడా ఉండవు కాబట్టి.. వారికి ఆ రూ. ఐదు దొరకడం కూడా దుర్లభమే కాబట్టి.. ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. పేదల ఆకలిని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వానికి.. అన్నాదాత సుఖీభవ అనే ఆశీర్వాదాలు ఎక్కువగానే లభిస్తాయి.