ఆర్.ఆర్.ఆర్ తరవాత… ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఏమిటన్న విషయంలో క్లారిటీ వచ్చేసింది. కొరటాల శివతో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఇది ఖాయం. `డెడ్లైన్`కి ఇచ్చిన ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో తన తదుపరి ప్రాజెక్టుపై పెదవి విప్పాడు ఎన్టీఆర్. అయితే.. బుచ్చిబాబుతో చేయబోయే సినిమా గురించి ఎలాంటి హింటూ ఇవ్వలేదు. `ఉప్పెన`తో ఒక్కసారి అందరి దృష్టిలో పడ్డాడు బుచ్చిబాబు. తన తదుపరి సినిమా ఎన్టీఆర్ తోనే అని టాలీవుడ్ టాక్. మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. అయితే.. ఈ ప్రాజెక్టుపై ఎన్టీఆర్ ఎలాంటి హింటూ ఇవ్వలేదు.
కొరటాల శివ సినిమా అయ్యేసరికి మరో యేడాది పడుతుంది. ఆ తరవాత ప్రశాంత్ నీల్ రెడీగా ఉన్నాడు. కొరటాల శివ కీ. ప్రశాంత్ నీల్ కీ మధ్య ఏదైనా గ్యాప్ వస్తే, అప్పుడు…. బుచ్చితో కమిట్ అవుదామనుకుంటున్నాడు ఎన్టీఆర్. అయితే అంత గ్యాప్ వస్తుందో, లేదో చెప్పడం కష్టం. అందుకే బుచ్చిబాబు ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి కమిట్మెంటూ ఇవ్వలేకపోతున్నాడు. బుచ్చి కూడా ఎన్టీఆర్ కి సరిపడా స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నాడు. తనకు కథ పూర్తి స్థాయిలో సిద్ధం కావడానికి మరో ఆరు నెలల సమయమైనా పడుతుందట. అందుకే.. బుచ్చి ప్రాజెక్టుపై ఎన్టీఆర్ ఏమీ మాట్లాడలేదని, కొరటాల శివ తో సినిమా మొదలై, ఓ కొలిక్కి వచ్చేంత వరకూ ఎన్టీఆర్ – బుచ్చిబాబు ప్రాజెక్టుపై ఓ క్లారిటీ ఉండదని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి.