పుష్ష 2 భాగాలుగా రాబోతోందన్న విషయం తెలుగు 360 ముందే చెప్పింది. ఇప్పుడు దాన్ని మైత్రీ మూవీస్ సంస్థ కూడా ఖరారు చేసేసింది. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోందని క్లారిటీ ఇచ్చేసింది. రెండు భాగాలుగా వస్తున్నప్పుడు మరి పారితోషికాలు ఎలా ఇవ్వబోతున్నారన్నది ఆసక్తికరమైన విషయం.
నిజానికి స్క్రిప్టు దశలో పుష్షని రెండు భాగాలుగా చేసే ఆలోచన లేదు. తీస్తున్న లెంగ్త్ ని చూసుకుంటే.. చివరికి 4 గంటల వరకూ ఫుటేజీ వస్తుందన్న నిర్దారణకు వచ్చాడు సుకుమార్. నాలుగు గంటల సినిమాని రెండున్నర గంటలకు కుదించడం కంటే, రెండు భాగాలుగా విభజించి అమ్ముకుంటే.. కమర్షియల్ గా డబుల్ ప్రాఫిట్ అని గుర్తించి ఈ రెండు భాగాల ఫార్ములాని.. తెరపైకి తీసుకొచ్చాడు.
ఒకవేళ రెండు భాగాలుగా తీయాలని ఐడియా లేకపోయినా.. ఈ సినిమా బడ్జెట్లో ఎలాంటి మార్పూ ఉండదు. ఎందుకంటే.. సుకుమార్ తాను అనుకున్నదంతా తీసేస్తాడు. ఆ తరవాత దాన్ని కుదించుకోవడం ఎడిటర్ పని. కాబట్టి.. బడ్జెట్ విషయంలో ఎలాంటి తేడా ఉండదన్నమాట. రెండు భాగాలుగా తీయడం నిర్మాతకే సేఫ్. మరోవైపు పారితోషికాల్లోనూ ఎవరికీ ఎలాంటి బోనసూ లేదు. సుకుమార్ తన పారితోషికానికి అదనంగా రూ.5 కోట్లు, అల్లు అర్జున్‌కి 10 కోట్లు దక్కుతున్నాయట. కెమెరామెన్‌కీ, సంగీత దర్శకుడికీ (దేవిశ్రీ)కి సైతం బోనస్ దక్కుతోందని, తమ పారితోషికంలో 25 శాతం అదనంగా లభించనుందని తెలుస్తోంది.
ఈ సినిమా రేట్ల విషయంలోనూ మైత్రీ కొత్త పోకడల్ని అవలంభిచనుందని టాక్. మైత్రీకి సంస్థాగతమైన బయ్యర్లు ఉన్నారు. వాళ్లకే పుష్షని అమ్మబోతున్నారు. రెండు భాగాలూ ఒకేసారి ప్యాకేజీగా అందుకుంటే ఒకరేటు, విడివిడిగా కొంటే మరో రేటు. రెండు భాగాలూ కొనేవాళ్లకే మైత్రీ తొలి ప్రాధాన్యత ఇవ్వబోతోందట.