హైదరాబాద్ లో ప్రస్తుతం లాక్ డౌన్ అమలు అవుతోంది. ఉదయం 6 నుండి 10 గంటల మధ్యలో నాలుగు గంటల పాటు మాత్రమే అన్నిరకాల కార్యకలాపాలకు అనుమతి ఉంది. ఉదయం పది తర్వాత హాస్పిటల్స్, మెడికల్ షాప్స్, బ్యాంక్ మినహాయించి మిగతా కార్యకలాపాలకు అనుమతి లేదు. దీనికి తోడు పెళ్లి వంటి సందర్భాలకు గరిష్ఠంగా 40 మంది అంత్యక్రియలకు 20 మంది హాజరు కు మాత్రమే అనుమతి ఉంది. అయితే టిఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబాద్ కి చెందిన కార్పొరేటర్ రవీంద్ర రెడ్డి బర్త్ డే సందర్భంగా జరిగిన ఈ వేడుకకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరయ్యారు. ఆయనతోపాటు ఆ కార్యక్రమంలో వందమంది దాకా పాల్గొన్నారు. ఏ మాత్రం సోషల్ డిస్టెన్స్ పాటించకుండా జరిగిన ఆ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పెళ్లి వంటి సందర్భానికి సైతం 40 మందికి మించకుండా నిర్వహించుకోవాలని నిబంధనలు ఉండగా పుట్టిన రోజుకి 100 మంది దాకా హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా అధికార పార్టీ ఎమ్మెల్యే కి లాక్ డౌన్ నిబంధనలు వర్తించవు ఏమో అంటూ నెటిజన్ల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి.
ఎమ్మెల్యే సంగతి ఇలా ఉంటే పాతబస్తీ ప్రాంతంలో లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. శుక్రవారం రంజాన్ సందర్భంగా పాతబస్తీ వాసులు షాపింగ్ ఇతర కార్యకలాపాల కోసం రోడ్లపైకి వస్తున్నారు. ఆ ప్రాంతంలో దుకాణాలు సైతం కొన్నిచోట్ల తెరచి ఉండడం గమనార్హం. ఏది ఏమైనా లాక్ డౌన్ నిబంధనలను ప్రజలు సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది.