ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వ్యాక్సిన్ల విషయంలో తమపై జరుగుతున్న ప్రచారాన్ని తప్పని నిరూపించుకునేందుకు గ్లోబల్ టెండర్లకు వెళ్లింది. కోటి మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. మూడు వారాల్లో ఆసక్తిని వ్యక్తం చేస్తూ టెండర్లను దాఖలు చేయాలని అంతర్జాతీయ వ్యాక్సిన్ కంపెనీలకు సమయం ఇచ్చింది. దేశంలో రెండే కంపెనీలు.. వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తున్నాయి. వాటి ఉత్పత్తి సామర్థ్యం పరిమితంగా ఉంది. అదే సమయంలో.. ఏపీ సర్కార్.. ఆయా కంపెనీలకు అడ్వాన్సులు కట్టలేదు. దీంతో.. ఆయా కంపెనీల నుంచి వచ్చే స్టాక్ ఏపీకి పరిమితంగా ఉండనుంది. దీనిపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
దీనికి చెక్ పెట్టేందుకు గ్లోబల్ టెండర్లకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వెంటనే… టెండర్ ప్రకటన కూడా జారీ చేసేశారు. అయితే ప్రస్తుతానికి దేశంలో రెండు వ్యాక్సిన్లకు మాత్రమే కేంద్రం అనుమతి ఇచ్చింది. విదేశీ కంపెనీలకు అనుమతి లేదు. మరి గ్లోబల్ టెండర్ల వల్ల ఏమిటి ఉపయోగం అనే ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది. దీనికి కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఎఫ్డీఏతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి పొందిన వ్యాక్సిన్లను దిగుమతి చేసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. ఇంత వరకూ దిగుమతి చేసుకుంటామని తమకు ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని తెలిపింది.
ఫైజర్, మోడెర్నా లాంటి సంస్థలు టీకాలు సరఫరా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాయి. కేంద్రం వద్ద దరఖాస్తులు కూడా పెట్టుకున్నాయి. వాటికి పర్మిషన్ ఇస్తే.. ఇండియాలో వ్యాక్సిన్ లభ్యత పెరుగుతుంది. అదే సమయంలో రష్యా వ్యాక్సిన్ను వచ్చే వారం నుంచి ఇండియాలో ప్రజలకు పంపిణీ చేయాడనికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే.. కోవాగ్జిన్… కోవిషీల్డ్ ఉత్పత్తి కూడా.. పెరుగుతోంది. రాబోయే రెండు, మూడు నెలల్లో .. చాలా వరకూ వ్యాక్సిన్ల కొరత తీరే అవకాశం కనిపిస్తోంది.