ఆంధ్రప్రజల దుస్థితికి సరిహద్దుల్లో క్యూ కట్టిన అంబులెన్స్లే్ ప్రత్యక్ష సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. తమకు ఏపీలో బెడ్లు దొరకలేదనో.. మెరుగైన వైద్యం అందనో కానీ.. తమ వాళ్లను కాపాడుకోవాలన్న ఆశతో చాలా మంది హైదరాబాద్ బాట పడుతున్నారు. అంబులెన్స్‌లలో ఆత్మీయుల్ని తీసుకుని వెళ్తున్నారు. గతంలో వారికి ఏ ఇబ్బంది ఉండేది కాదు…ఇప్పుడు మాత్రం అంబులెన్స్లన్న కనికరం కూడా లేకుండా సరిహద్దుల్లో తెలంగాణ సర్కార్ ఆపేస్తోంది. మూడు రోజుల కిందంట వచ్చిన సమస్యను… పరిష్కరించేశామని సజ్జల వంటి ప్రభుత్వ సలహాదారు గొప్పగా చెప్పారు .. కానీ ఆ సమస్య పరిష్కారానికి కనీస ప్రయత్నం కూడా ప్రభుత్వం వైపు జరగలేదని నిర్ధారణ అయిపోయింది.
తెలంగాణ సరిహద్దుల్లో కనీసం యాభై అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు నిలిపివేశారు. హైదరాబాద్ ఆస్పత్రిలో బెడ్ ఖరారు అయినట్లుగా ఆస్పత్రి వారిచ్చిన లేఖతో పాటు.. హైదరాబాద్ పోలీసులు ఇచ్చే ఈ పాస్ తీసుకుంటే మాత్రమే హైదరాబాద్‌లోకి అనుమతి ఇస్తున్నారు. పోలీసులు ఈ పాస్‌లను అంబులెన్స్‌లకు ఇవ్వడం మానేశారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయ పలుకుబడి ఉన్న అతి కొద్ది మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి చొరవా తీసుకోవడం లేదు.
కనీసం హైదరాబాద్ వెళ్లాలనుకుంటున్న వారి అంబులెన్స్‌లు వెనక్కి పిలిపించి..సమీపంలో ఎక్కడైనా మెరుగైన ఆస్పత్రిలో చేర్పించాలన్న ఆలోచన కూడా చేయడం లేదు. అంబులెన్స్‌లలో ఆక్సిజన్ అయిపోతుందన్న ఆందోళనతో రోగుల బంధువులే మళ్లీ వెనక్కి పోతున్నారు. ప్రభుత్వాలు ఇంత నిర్ధయగా వ్యవహరించడం సమంజసం కాదన్న విమర్శలు అన్ని వర్గాల నుంచి వస్తున్నాయి. కానీ ప్రాణాలు అరచేత పట్టుకుని ఉన్న రోగులు.. వారి బంధువులకు మాత్రమే ఆ వేదన .. మిగతా ఎవరికీ పట్టింపు లేదు.