వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు హైదరాబాద్ వచ్చారని తెలియడంతోనే ఏపీ సీఐడీ అధికారులు రంగంలోకి దిగిపోయారు. ఏం కేసులు పెట్టారు..? ఏ విషయంలో పెట్టారు..? అనే సమాచారం ఏమీ బయటకు రాకుండా.. ఉన్న పళంగా పోయి ఆయనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. శుక్రవారం ఎంపీ రఘురామకృష్ణరాజు పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్ వచ్చారు. ఆయన రాక కోసం కాచుకుకూర్చున్నట్లుగా ఉన్న సీఐడీ అధికారులు ఆయన ఇంటికి దండులాగా వెళ్లారు. నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని సీఐడీ కేసు పెట్టింది. ఆ కేసులో నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేసి.. సీఐడీ అధికారులు తీసుకెళ్లారు.
అయితే ఆయనకు గతంలో కేంద్రం.. సీఆర్పీఎఫ్ సెక్యూరిటీనీ కల్పించింది. తమ ఉన్నతాధికారుల అనుమతి ఉంటేనే అరెస్ట్ చేసేందుకు అనుమతిస్తామని వారు మానవహారంగా నిలబడి.. ఏపీ సీఐడీ అధికారులను అడ్డుకున్నారు. తనను ఏదో ఓ కేసులో అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఆయన గతంలో హైకోర్టుకు వెళ్లి.. అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయినప్పటికీ.. రెండు రోజులు కోర్టుకు సెలవులు ఉండటం.. శుక్రవారం కలసి రావడంతో.. ఆయన ఇంటికి సీఐడీ అధికారులు వెళ్లినట్లుగా తెలుస్తోంది. కొంత వాగ్వాదం తర్వాత సీఐడీ అధికారులు ఆయనను బలవంతంగా తీసుకెళ్లారు.
ఏపీలో పోలీసులు, సీఐడీ , ఏసీబీ వంటి వాటిని ఉపయోగించుకుని రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టి.. అరెస్టులు చేయించడం కామన్‌గా మారింది. ఇప్పటి వరకూ టీడీపీ నేతలే బాధితులుగా ఉన్నారు. ఇప్పుడు సొంత ఎంపీని అరెస్ట్ చేయించేందుకు కూడా.. వైసీపీ పెద్దలు వెనుకాడలేదు. రెబల్‌గా మారిన వైసీపీ ఎంపీ.. జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని ఆయన సీబీఐ కోర్టును కూడా ఆశ్రయించారు. దానిపై విచారణ కూడా జరుగుతోంది. ఈ సమయంలో రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేశారు.
ప్రైవేటు గ్యాంగుల మాదిరిగా.. ఏ కేసులు పెట్టారో కూడా చెప్పకుండా.. నోటీసులు ఇవ్వకుండా సీఐడీ అధికారులు గతంలో కొంత మంది టీడీపీ నేతల్ని అరెస్ట్ చేశారు. ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు అంతే అరెస్ట్ చేశారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజుపై అదే వ్యూహాన్ని పాటించారు. దీనిపై రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇదేం అరాచక పాలన అని చెబుతున్నాయి. పుట్టినరోజునాడే పగబట్టి మరీ.. రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేయించడం..జగన్ వికృత మనస్థత్వానికి సూచిక అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.