“పోలీస్ వర్క్ ఫర్ ఏ కాజ్ నాట్ అప్లాజ్..” .. పోలీసులు ఎవరి మెప్పు కోసమో పని చేయరు.. చేయకూడదు. అలా చేస్తే ఏమవుతుంది..?. ధర్మం గతి తప్పుతుంది. నేరగాళ్లదే రాజ్యం అవుతుంది. ప్రజలు న్యాయం కోసం మరో వ్యవస్థను వెదుక్కోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితి వస్తే పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైనట్లే. ఆ వ్యవస్థలోనే ఐక్యమత్యం లోపించినట్లే. ఏపీలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. నిజంగా పోలీస్ డిపార్టుమెంట్లో ఏం జరుగుతోంది..? పోలీసులు ఓ కాజ్ కోసం పని చేస్తున్నారా..? లేక అప్లాజ్ కోసం పని చేస్తున్నారా..?.
ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే ఓ పద్దతి ఉంటుంది. ఎందుకంటే రాజ్యాంగం అందరికీ హక్కులు ఇచ్చింది. కానీ ఏపీ పోలీసులు.. సీఐడీ.. ఏసీబీలకు రాజ్యాంగం ఎక్కువ హక్కులు ఇచ్చేసినట్లుగా ఉంది. ఓ వైపు సుప్రీంకోర్టు .. కరోనా కాలంలో ఇష్టం వచ్చినట్లుగా అరెస్టులు చేయవద్నది స్పష్టమైన సూచనలు ఇచ్చినా.. అన్నీ లైట్ తీసుకుని.. అధికార పెద్దల రాజకీయ కోపాలను తీర్చడానికి పోలీసులు ఉత్సాహపడుతున్నారు. మొన్న ధూళిపాళ్ల నరేంద్ర.. ఇవాళ ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టుల్ని చూసిన సామాన్యులు బెదిరిపోతున్నారు. ఇదేం పోలీసు వ్యవస్థ అని భయపడుతున్నారు.
చంద్రబాబుపై ఎవరైనా ఫిర్యాదులు చేస్తే… పోలీస్ స్టేషన్లకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. ఒక్క చంద్రబాబు కాదు… అధికార పెద్దలను విమర్శించేవారిపై కేసులు పెట్టేందుకు ఎవరైనా వస్తే.. వారి కోసమే పోలీస్ స్టేషన్ ఉందన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అదే.. తమకు అన్యాయం జరిగిందని.. ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వస్తే.. వారిపై కరోనా పేరుతో విపత్త చట్టం కింద కేసులు పెట్టేస్తున్నారు. హత్య కేసుల్లో నిందితుల్ని పట్టుకోలేకపోతున్నారు. అడ్డంగా దొరికిపోయిన కేసుల్లో ప్రధానంగా నిందితులుగా చేర్చాల్సిన వారిని చేర్చడం లేదు. ఓ పార్టీ వారికే న్యాయం అన్నట్లుగా ఉంది పరిస్థితి.
రాజకీయాల్ని కాస్త తరచి చూస్తే తెలుస్తుందనేది.. రాజకీయ విశ్లేషకులు చెప్పేమాట. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం చెప్పినట్లుగా పోలీసులు చేయడం విధి. అంత మాత్రాన హత్య కేసుల్ని నీరుగార్చడం.. నిందితుల్ని రక్షించడం… అధికార పార్టీకి చెందిన రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించడం… వంటివి చేయడం కాదు.. ప్రభుత్వం చెప్పినట్లుగా చేయడం అంటే.. రాజ్యాంగ పరిధిలో చేయాలి.. చట్ట పరిధిలో చేయాలి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే.. వారు అరెస్ట్ చేసే సంఘ విద్రోహశక్తులకు … వారికి తేడా ఏముంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. పోలీసు వ్యవస్థకే తాము మరింత చులకన కాకుండా… ప్రజల్లో తాము రక్షకులమే అన్న భావన కల్పించాల్సిన బాధ్యత ఏర్పడింది.