ఈ దేశానికి ఇప్పుడు కోట్ల వాక్సిన్లు కావాలి.
కొండంత ధైర్యం కావాలి.
ఇంకొంతమంది సోనూసూద్ లు కావాలి!
సోనూసూద్… ఎందుకో సోనూసూద్ తెగ నచ్చేస్తున్నాడు జనాలకు. మంచితనం సైతం మూర్చబోయేలా.. తాను చేస్తున్న పనుల్ని చూస్తుంటే – ఓ మనిషి ఇంత చేయగలడా? అనిపిస్తోంది. `ఆపద` అంటే చాలు. తక్షణం వాలిపోతున్నాడు. సాయం అనే మాట వినిపిస్తే చాలు. తాను ప్రత్యక్షమైపోతున్నాడు. అచ్చం సినిమాల్లో హీరోలు చేసినట్టు.
మీ విరాళాలన్నీ సోనూసూద్‌కి పంపండి. కచ్చితంగా న్యాయం జరుగుతుంది. సాయం అందుతుంది.
సోనూ ఓ సామాన్యుడిగానే ఇంత చేస్తుంటే – తానే ప్రధాని అయితే…?
– సోనూపై సోషల్ మీడియాలో కనిపిస్తున్న కామెంట్లు ఇవి. నిజంగా ఇందులో ఏమాత్రం అతిశయోక్తి ఏం లేదు. తన బ్యాంకు బాలెన్సుల్ని – ప్రజా సంక్షేమం కోసం వాడేస్తున్న సోనూని చూస్తే.. ఎవరికైనా అలానే అనిపిస్తుంది. నేతలు, ప్రభుత్వాలు, వ్యవస్థలు, సంస్థలు చేయాల్సిన సాయాన్ని తానొక్కడే చేసేస్తున్నాడు. ఇక మున్ముందు ఏమేం చేస్తాడో తెలీదుగానీ, ఈ దేశంలో ఓ రియల్ హీరో ఉద్భవించాడన్న సంకేతాల్ని మాత్రం ఇంకాస్త గట్టిగా పంపగలుగుతున్నాడు సోనూ.
సోనూ సరే. మరి మిగిలిన హీరోల మాటేంటి? వాళ్లంతా ఏం చేస్తున్నట్టు.? ట్విట్టర్లో సందేశాలతో, వాట్సప్ వీడియోలతో కాలక్షేపం చేయడం తప్ప. `చేతులు కడుక్కోండి. మూతులు కడుక్కోండి. ఇంట్లోనే ఉండండి` అంటూ చీటికి మాటికి చెవిలో పోరు పెట్టడం `సాయం` కాదు. ఇప్పుడు ఈ దేశానికి మాటలు చెప్పేవాళ్లు కాదు. చేతలతో తామేంటో చూపించేవాళ్లు కావాలి. ఇప్పటి వరకూ ఏ హీరో కూడా.. తనంతట తాను ముందు కొచ్చి – కోవిడ్ బాధితుల్ని ఆదుకోవడం ఎవ్వరూ చూళ్లేదు. గుప్తదానాలు చేస్తున్నాం లెండి.. అనేవాళ్ల విషయంలో ఎలాంటి కామెంట్లూ చేయలేం. చేతులెత్తి దండం పెట్టడం తప్ప.
ఒక్కో సినిమాకీ పాతిక, యాభై, వంద కోట్లు తీసుకుంటున్న హీరోల్లారా..? ఆ డబ్బు జనం నుంచే వస్తుందన్న విషయాన్ని మీరు గ్రహించారా? అదే తెలిస్తే.. ఇప్పటి వరకూ ఎందుకింత మౌనం..? ఆక్సిజన్ సిలెండర్లు లేక ప్రాణాలు కోల్పోతున్న వాళ్లలో మీ అభిమానులూ ఉన్నారు. ఆసుపత్రిలో బెడ్లు లేక… రోడ్ల మీద పడిగాపులు కాస్తున్న వాళ్లలో.. మీ సినిమా టికెట్ల కోసం థియేటర్ల ముందు క్యూ కట్టినవాళ్లూ ఉంటారు. వాళ్లని ఆదుకోవాలని ఎప్పుడు అనిపిస్తుంది..? కనీసం సోనూలాంటి వాళ్లని చూసినప్పుడల్లా.. `మనమూ ఏదైనా చేయాలి` అనే స్ఫూర్తి కలగడం లేదా?
ఆ హీరో రికార్డు ఈ సినిమాతో బద్దలైపోయింది…
ఇండ్రస్ట్రీ ఆల్ టైమ్ రికార్డ్ నాదే… అని కాలర్లు ఎగరేయడం కాదు.
దమ్ముంటే ఇప్పుడు సోనూసూద్ రికార్డుల్ని బద్దలు కొట్టండి. సోనూ చేసే సాయంలో కనీసం పదో వంతు చేయడానికైనా ప్రయత్నించండి. రీలులోనే కాదు. రియల్ లైఫ్ లోనూ మీరు హీరోలన్న విషయాన్ని జనం ఒప్పుకుంటారు. ఎప్పటిలా… సోషల్ మీడియాలో కాకమ్మ కబుర్లు చెబుతూ, కాలక్షేపం చేద్దాం అనుకుంటే మాత్రం… చరిత్రలో ఎప్పటికీ జీరోలుగా మిగిలిపోతారు. ఛాయిస్ మీదే.