చిత్రం, నువ్వు నేను, జయం – ఇలా వరుస హిట్లతో విరుచుకుపడిపోయాడు తేజ. ఈ అన్ని సినిమాలకూ… ఆర్పీ పట్నాయక్ నే సంగీత దర్శకుడు. ఇద్దరి ప్రయాణం ఒకేలా మొదలై, ఒకేలా ఉవ్వెత్తున లేచి, ఒకేలా… పతనం అయ్యింది. ఇప్పుడు తేజ మ్యాజిక్కూ లేదు. ఆర్పీ మ్యూజిక్కూ లేదు. మధ్యలో తేజ నుంచి `నేనే రాజు నేనే మంత్రి` అనే హిట్టయినా వచ్చింది. ఆర్పీ నుంచి అదీ లేదు. దర్శకుడిగా కొన్ని ప్రయత్నాలు చేసినా.. అవేం ఆర్పీని ఒడ్డున పడేయలేకపోయాయి.
ఇంత కాలానికి.. వీరిద్దరూ మళ్లీ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. తేజ నుంచి వస్తున్న చిత్రం 1.1 కోసం ఆర్పీ బాణీల్ని సమకూరుస్తున్నాడు. అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రానికి తేజ దర్శకుడు. ఈ సినిమాకి కూడా ఆర్పీనే సంగీతం అందిస్తున్నాడు. చూస్తుంటే.. ఆర్పీ – తేజల మధ్య మళ్లీ ట్యూన్ కుదిరినట్టే కనిపిస్తోంది. వీరిద్దరూ.. మనస్ఫూర్తిగా పనిచేస్తే… చిత్రం, నువ్వు నేను లాంటి మ్యాజిక్ మళ్లీ రిపీట్ అయ్యే ఛాన్సుంది. వీరిద్దరూ ట్రాక్ లో పడడానికి, ముఖ్యంగా ఆర్పీకి ఇదే ఆఖరి అవకాశం. మరి ఏం చేస్తారో చూడాలి.