దేశంలో కరోనా రోగులు.. మరణాలు వంటి వాటిపై రాష్ట్రాలు తప్పుడు సమాచారం ఇస్తున్నాయని కేంద్రానికి డౌట్ వచ్చింది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఇదే అనుమానం వచ్చింది. కరోనాపై నిర్వహించిన సమీక్షలో ఆయన ఉన్నతాధికారులకు ఈ అంశంపైనే దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాలు ఖచ్చితమైన లెక్కలు చెప్పేలా ప్రోత్సహించాలని.. ఆయన అధికారుల్ని ఆదేశించింది. నిజానికి ఇప్పుడు దేశంలో ఏ ఒక్క రాష్ట్రం కూడా ఖచ్చితమైన సమాచారం ఇస్తుందని ఎవరూ నమ్మడం లేదు. ఏ రాష్ట్రంలో చూసినా.. మరణాలు వందలోపే చూపిస్తున్నారు. కానీ స్మశానాల్లో మాత్రం ఇరవై నాలుగు గంటలు మరణించిన వారి చితులు తగలబడుతూనే ఉన్నాయి. గతంలో ఉన్న మరణాలను ఇప్పుడు అసాధారణంగా పెరిగిన మరణాలను లెక్కలోకి తీసుకుని .. తేడా చూస్తే.. పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో అర్థమవుతుంది.
ఆ రాష్ట్రం.. ఈ రాష్ట్రం అని కాదు.. అన్ని రాష్ట్రాలు కరోనా కేసుల్ని.. మరణాల్ని వీలైనంత తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. ఒక్క కేరళలాంటి రాష్ట్రాలు మాత్రం.. ఏది నిజమో.. అదే చెబుతున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తం అవుతున్నారు. ఇతర రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో ఉన్న కరోనా పరిస్థితి.. వేరియంట్ల విజృంభణ..వైద్య సౌకర్యాలు వంటి అంశాలను సైతం బహిరంగపర్చడం లేదు. ఫలితంగా.. ప్రజలు ఆ వైరస్ బారిన పడటానికి ఎక్కువ ఆస్కారం ఏర్పడుతోంది. కేంద్రానికి కూడా నమోదవుతున్న కేసులు ..మరణాలపై సందేహం ఉంది. కానీ రాష్ట్రాలు ఇచ్చే సమాచారం తప్ప.. కేంద్రానికి మరో సోర్స్ లేదు. సొంతంగా గణన చేయడం సాధ్యం కాదు. అందుకే.. కేంద్రం కూడా… అసలైన కరోనా పరిస్థితిపై అవగాహనకు రాలేకపోతోంది.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెప్పినట్లుగా రాష్ట్రాలన్నీ..భేషజాలకు పోకుండా… అసలైన లెక్కలు వినిపిస్తే.. దేశంలో ఎంతదుర్భర పరిస్థితి ఉందో అర్థమైపోతుంది. అది కష్టంగానే ఉండొచ్చు. కానీ తదుపరి చర్యలు తీసుకోవడానికి అప్రమత్తం అవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు… కరోనాను దాచి పెట్టుకోవడం అంటే… దేహంలో క్యాన్సర్ని దాచి పెట్టుకున్నట్లే్. అది అలా పెరిగిపోతుంది. ఎంత ముందుగా గుర్తించి.. క్యూర్ చేసుకుంటే.. అంత త్వరగా కోలుకుంటారు. లోపల్లాపల ముదిరిపోతే.. ఆయారాష్ట్రాలకే ప్రమాదం. కానీ రాజకీయమే ముఖ్యమనుకునే పార్టీలు.. పాలకులు… ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి దాటిపోయింది.