కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గి… వాతావరణం కాస్త చల్లబడి, థియేటర్లు తెరచుకుని.. కొత్త సినిమాల తాకిడి మొదలైన వేళ. హీరోగారు పీఆర్వోకి కబురెట్టాడు. వచ్చీరాంగానే కుశల ప్రశ్నలేవీ లేకుండా డైరెక్టుగా మేటర్ లోకి వెళ్లిపోతూ…
“మన సినిమాకి రిలీజ్ డేట్ ఫిక్సయ్యిందోయ్..“ అన్నాడు విగ్గుని సరి చేస్తూ.
ఆ వార్త వినగానే ఎగిరి గంతేయాల్సిన పీఆర్వో… “ఆహా… అలానా బాబూ..“ అని ఊరుకున్నాడు నిర్లిప్తంగా.
అయిన దానికీ, కాని దానికి ఓవరాక్షన్ చేసే పీఆర్వో నుంచి ఇలాంటి రియాక్షన్ ఊహించని హీరో.. కాస్త ఉసూరుమన్నాడు.
“ఈసారి ప్రమోషన్లు గట్టిగా చేయాలి మరి.. ప్యాకేజీలన్నీ నువ్వే మింగేయక.. మీడియాకీ కొంచెం ఖర్చు పెట్టు“ అంటూ గత సినిమా తాలుకూ చేసిన తప్పుల్ని ఓసారి గుర్తు చేసి, ఇందాకటి నిర్లిప్తమైన జవాబుకి అప్పటికప్పుడు రివైంజ్ తీర్చేసుకున్నాడు హీరో.
ప్యాకేజీల పేరెత్తగానే పీఆర్వో గుండె డీటీఎస్ ఎఫెక్టుతో ఖలుక్కుమంది.
“ఏం చేసినా లాభం లేదు సార్.. మీ ఫ్యాన్స్ బాగా గుర్రుగా ఉన్నారు..“
“ఎందుకూ..“
“సెకండ్ వేవ్ టైమ్‌లో మనం జనాల్ని పట్టించుకోలేదని ఓ బ్యాడ్ టాక్ నడుస్తోంది“
“ఎందుకు చేయలేదూ.. చేతులూ, మూతులూ జాగ్రత్త అంటూ వీడియోలు వదిలి.. ట్విట్టర్‌లో ట్రెండింగ్ చేశాం కదా“
“దాన్ని సాయం అనరు బాబూ… ఫ్యాన్స్ కెప్పుడూ సాయం డబ్బుల రూపంలో కనిపించాలి.. లేదంటే వాళ్లు హర్టవుతారు.“
“అదంతా ఒట్టి ట్రాష్. హుద్ హుద్ వచ్చినప్పుడు మనం ఏమైనా చేశామా? చెన్నై వరదలప్పుడు ఏమైనా ఇచ్చామా? ఆ తరవాత కూడా మన సినిమాలు ఆడాయి కదయ్యా.. ఫ్యాన్స్‌కి ఫ్లాష్ బ్యాక్ లు గుర్తు పెట్టుకునేంత ఓపిక ఉండదు సామీ“
“ఈసారి పరిస్థితి మారింది బాబూ.. జనం ఆక్సిజన్ అందక అల్లాడిపోయారు. ఆసుపత్రిలో బెడ్లు లేక నానా కష్టాలూ పడ్డారు…“
“ఆక్సిజన్ సిలెండర్లూ.. గ్యాస్ సిలెండర్లూ.. మనమెందుకు ఇస్తామయ్యా.. కావాలంటే.. ట్విట్టర్‌లో నాలుగు స్లోగన్లు పడేస్తాం గానీ..“
“ఆ సోది ఎక్కువైపోయే… ఆఖరికి మీ ట్విట్టర్ ని ఫాలో అవ్వడం కూడా మానేస్తున్నారు బాబూ..“ ఉన్నది ఉన్నట్టు కక్కేశాడు పీఆర్వో.
హీరో ఈగో హర్టయ్యింది. అంతలోనే వాస్తవంలోకి వచ్చి ఆలోచించాడు.
“మరేం చేద్దాం..“
“వాళ్ల మనసుల్ని మళ్లీ మీ వైపుకు లాగాలి బాబూ..“
ఆలోచనలో పడ్డాడు హీరో.
“ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉందిగా.. ఫ్యాన్స్‌ని ఉత్తేజ పరుస్తూ.. నాలుగు డైలాగులు చెప్పేద్దాం.. ఈ రక్తం పంచిన తమ్ముళ్లు.. వైరస్ ని వెంటాడే అన్నలూ లాంటివి కాకుండా… ట్రెండీగా కొత్త స్పీచు రాయించు.. కరోనాతో చనిపోయిన ఒకరిద్దరు ఫ్యాన్స్ పేర్లు తలచుకుని.. బొటా బొటా రెండు కన్నీటి బొట్లు రాలుస్తా.. సరిగ్గా నన్ను ఓదార్చడానికి మన డైరెక్టర్ని నా దగ్గరకు పంపు..“
“నాకు తెలుసు బాబూ.. మీరు సెట్లో కంటే, స్టేజ్‌పైనే ఎక్కువ నటిస్తారని..“ మెచ్చుకోలుగా అన్నాడు పీఆర్వో. కానీ అంతలోనే కాస్త గ్యాప్ ఇచ్చి.. “అయినా సరిపోదేమో బాబూ…“ అంటూ నిట్టూర్చాడు.
“నా ప్రతీ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కొచ్చి నాకంటే ఎక్కువ మాట్లాడుతుంటాడే.. ఎవడాడూ..“
“బ్లేడు బాబ్జీ బాబూ..“
“ఆ.. వాడికి ఫోన్ కలుపు“
నెంబర్ డయిల్ చేసి, హీరో చేతిలో ఫోన్ పెట్టాడు పీఆర్వో..
“బా……….. బూ..“ అవతలి నుంచి బ్లేడు బాబ్జీ గొంతు ఖంగుమంది.
సోది లేకుండా… విషయం చెప్పేశాడు హీరో.
“మీరు చూస్తుండండి బాబూ.. ఈసారి స్పీచు ఇంకా అదిరిపోద్ది.. కరోనా ని అడ్డుకోవాలంటే మీకు వాక్సిన్ కావాలేమో. నాకు మా హీరో పేరు చాలు. అని చొక్కా బొత్తాలు విప్పి.. నా గుండెలు చూపిస్తా బాబూ… అక్కడ మీ పేరు రాసి పెట్టి ఉంటుంది.. ఫ్యాన్స్ ఫిదా… “ హ్హ హ్హ హ్హ… అవతలి నుంచి బ్లేడు బాబ్జీ రెచ్చిపోతున్నాడు.
“మొన్నామధ్య హిమాలయాలకు వెళ్లాను. అక్కడ ఓ రుషి తపస్సు చేసుకుంటూ కనిపించాడు. నువ్వు ఎన్నేళ్లు తపస్సు చేసినా దేవుడు వస్తాడో రాడో నీకే తెలీదు. మేం ఒక్కసారి మనసులో తలచుకోగానే మా దేవుడు ప్రత్యక్షమైపోతాడు.. అని మీ గురించి చెబుతా. ఆడిటోరియం అదిరిపోద్ది…“ బ్లేడు డైలాగుల మీద డైలాగులు కట్ చేసేస్తున్నాడు.
“వీడు మనకంటే.. ముదురులా ఉన్నాడయ్యా..“ అంటూ అమాంతం ఫోన్ కట్ చేసేశాడు హీరో.
“ఈ డోసు సరిపోతుంది కానీ.. ఇంకా ఏదో కావాలి“ అంటూ నసిగాడు పీఆర్వో.
“అమెరికాలోని అరొందలమంది నా అభిమానులకు సాయం చేసిన సంగతి చెబుదాం“
“మనమెప్పుడు చేశాం బాబూ..“
“వాళ్లెప్పుడు చూస్తారయ్యా.. ఫ్యాన్స్ ఏమైనా రివ్యూ రైటర్లు అనుకున్నావా లాజిక్కులు ఆలోచించడానికి. మనం అంటాం అంతే. వాళ్లకది సరిపోతుంది. కరోనాతో అల్లాడిపోతూ, చావు బతుకుల్లో ఉన్న నా ఫ్యాన్ ని వెదికి పట్టుకోండి. తన కోసం ఓ షో వేద్దాం.. అంతే. మేటర్‌క్లోజ్..“
“మీరు బ్రిలియంట్ బాబూ…“
***
అనుకున్నట్టే.. ప్రీ రిలీజ్ లో హీరోగారి స్పీచ్ హైలెట్. స్టేజ్ పై తన యాక్షన్ డ్రామాకి.. ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు. బ్లేడు బాబ్జీ చెప్పిన డైలాగులు ట్రెండింగ్ లో నిలిచాయి. సినిమాలో మేటర్ లేకపోయినా… ఫ్యాన్స్ చొక్కాలు చించుకుని మరీ చూసిన సినిమానే మళ్లీ మళ్లీ చూసి.. రికార్డులు కట్టబెట్టారు. ఆ తరవాతి సినిమాకి హీరోగారి పారితోషికం కూడా పెరిగింది.
మళ్లీ పీఆర్వోని పిలిపించాడు హీరో.
“నేను చెప్పలేదా.. ఇలా జరుగుతుందని… ఇప్పుడేమంటావోయ్..“ అన్నాడు రిలాక్డ్స్‌గా కాలుమీద కాలేసుకుంటూ.
“అవునుసార్.. మీరే కరెక్ట్“
“దీన్నిబట్టి నీకేమర్థమైంది..“
“ఈ ఫ్యాన్స్ ఒట్టి ఎమోషనల్ ఫూల్స్ సార్..“
“ఇది చాలా సింపుల్ విషయం. నువ్వే అనవసరంగా కాంప్లికేటెడ్ చేస్తున్నావ్. రాజకీయ నాయకులు ప్రజా సేవకు మళ్లీ మళ్లీ ఎలా పునరంకితాలు అవుతుంటారో.. మనం కూడా ఫ్యాన్స్ ని మళ్లీ మళ్లీ మన కోసం అంకితం అయ్యేలా చేసుకోవాలి..“ అంటూ తాను చెప్పాల్సింది చెప్పేసి లోపలకి వెళ్లిపోయాడు.