హైదరాబాద్‌లో రూ. ఐదు రూపాయల భోజన కేంద్రాలయిన అన్నపూర్ణ క్యాంటీన్లు కొనసాగుతాయని మీడియాకు సమాచారం ఇచ్చిన తెలంగాణ సర్కార్.. నిజానికి ఆపేసింది. దాంతో పేదలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చాలా చోట్ల టీఆర్ఎస్ నేతలు…టెంట్లు వేసి అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా మురికివాడలు.. రోజు కూలీలు ఉన్న చోట… ఈ అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కూడా టీఆర్ఎస్ నేతలు మాత్రమే ఎందుకు తాను కూడా అన్నదానం ఎందుకు చేయకూడదనుకుని.. గాంధీ ఆస్పత్రి పాయింట్ దగ్గర రోజుకు వెయ్యి మందికి అన్నదానం ప్రారంభించారు.
అలాగే… నిర్భాగ్యులు ఎక్కువగా ఉండే … సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద కూడా భోజనం పెట్టాలనుకున్నారు. కానీ ఆయన ప్రయత్నాలకు పోలీసులు చెక్ పెట్టారు. బేగంపేటలోనే ఆపేశారు. ఎందుకు ఆపారు అంటే.. పోలీసులు ఉన్నతాధికారులు ఆపమన్నారని చెప్పేశారు. రేవంత్ రెడ్డి టీం.. ఈ వ్యవహారం మొత్తాన్ని షూట్ చేసి.. సోషల్ మీడియాలో పెట్టింది. దీంతో ఒక్క సారిగా వైరల్ అయింది. ప్రభుత్వం ఉన్న క్యాంటీన్లు నడపకుండా.. ఇతరుల కడుపు నింపుతానంటే అడ్డుకోవడం ఏమిటన్న విమర్శలు సోషల్ మీడియాలో కనిపించడం ప్రారంభించాయి.
అన్నదానం చేసినా రాని ప్రచారం… పోలీసులు అడ్డుకోవడం వల్ల రేవంత్ రెడ్డికి కల్పించామని టీఆర్ఎస్ నేతలు గొణుక్కోవాల్సి వచ్చింది. అయినా సొంత నియోజకవర్గంలో ఎంపీని .. సేవా కార్యక్రమాలు చేస్తూంటే అడ్డుకోవడం సమంజసం కాదని.. రాజకీయాలు ఎలా ఉన్నా చూసుకోవచ్చని కొంత మంది న్యూట్రల్ పీపుల్ సోషల్ మీడియాలో రేవంత్‌కు సపోర్ట్ చేస్తున్నారు.