ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు కోర్టులను లెక్క చేయలేదు. ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్యం అందించాలని ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టేసి.. జిల్లా జైలుకు తరలించేశారు. ఆయనకు వైద్యం అందించే విషయంలోనే కాదు.. వైద్య నివేదిక అందించే విషయంలోనూ సీఐడీ అధికారులు.. కోర్టు నియమించిన మెడికల్ బోర్డు పెద్దగా పట్టింపులకు పోలేదు. ఉదయం పదిన్నర కల్లా సీఐడీ కోర్టుకు.. మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా హైకోర్టుకు .. మెడికల్ బోర్డు నివేదిక అందించాల్సి ఉంది. ముందుగా జీజీహెచ్‌లో తర్వాత రమేష్ ఆస్పత్రిలోనూ పరీక్షలు చేయించాల్సి ఉంది. కానీ రఘురామకృష్ణరాజును మధ్యాహ్నం నాలుగు గంటల వరకూ గుంటూరు జీజీహెచ్‌లోనే ఉంచారు.
అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షళను రికార్డింగ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. రికార్డింగ్ చేశారో లేదో క్లారిటీ లేదు… అక్కడ పరీక్షలు అయిపోయిన తర్వాత గుంటూరు రమేష్ ఆస్పత్రికి తరలించాల్సి ఉంది. కోర్టు ఆదేశాలు అంతే ఉన్నాయి. కానీ సీఐడీ అధికారులు ఎక్స్ట్రీమ్ స్టెప్ వేశారు. నేరుగా జిల్లా జైలుకు తరలించారు. కోర్టుకు నివేదిక సమర్పించడానికి ముందే తరలింపు పూర్తి చేశారు. బహుశా రమేష్ ఆస్పత్రిలో టెస్టులు చేస్తే.. భిన్నమైన ఫలితాలు వస్తాయని అనుకున్నారో… లేక గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ఇచ్చే నివేదిక చాలని అనుకున్నారో కానీ..టెస్టులను అంతటితో నిలిపివేశారు.
బహుశా… ఆయనకు ఎలాంటి అనారోగ్యం లేదని.. కాలి దెబ్బలు లేవని నివేదిక సిద్దం చేసి.. అలా తరలించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి అలాంటి నివేదికే ఉన్నా.. సీఐడీకి తెలియకూడదు. ఎందుకంటే.. కోర్టు సీల్డ్ కవర్లో అందించమని చెప్పింది. మొత్తానికి.. సీఐడీ .. సీఐడీ కోర్టు.. హైకోర్టులను కూడా లెక్క చేసే పరిస్థితిలో లేదని తేలిపోయింది. మెడికల్ బోర్డు నివేదిక అందించకపోవడంతో… కోర్టులు ఈ అంశంపై విచారణ జరపలేకపోయాయి. విచారణ జరిపితే న్యాయస్థానాలు ఎలా స్పందిస్తాయో.. అన్న ఆసక్తి ఇప్పుడు ఏర్పడింది.