కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అయినా రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించకూడదనుకున్న సీఐడీ అధికారులు.. ప్రభుత్వానికి షాక్ తగిలింది. సీఐడీ కోర్టు ఆదేశించించినట్లుగానే.. రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించాలని స్పష్టం చేసింది. గుంంటూరు ప్రభుత్వాసుపత్రిలో పది..పన్నెండు గంటల పాటు పరీక్షలు జరిపిన గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి జీజీహెచ్ బృందం.. రఘురామరాజుకు కొట్టినట్లుగా గాయాలు లేవని నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను న్యాయమూర్తి కోర్టులో చదివి వినిపించారు. రఘురామకృష్ణరాజు కాళ్లు వాచి ఉన్నాయని.. రంగు మారి ఉన్నాయని… వైద్యులు నివేదికలో తెలిపారు. ఎందుకు రంగు మారాయన్నది వైద్యులు చెప్పలేదు కానీ.. అవి కొట్టినందుకు వచ్చాయని మాత్రం చెప్పలేమని నివేదికలో చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంలో రఘురామకృష్ణరాజు న్యాయవాదులు.. సీఐడీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను … సీఐడీ అధికారులు ఉల్లంఘించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎందుకు ఉల్లంఘించాల్సి వచ్చిందని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వ తరపు న్యాయవాది వద్ద సమాధానం లేకపోయింది. వాదనల తర్వాత హైకోర్టు.. సీఐడీ కోర్టు ఆదేశాలను పాటించాల్సిందేనని స్పష్టం చేస్తూ తీర్పు ఇచ్చింది. అయితే విచారణ సమయంలో.. రమేష్ ఆస్పత్రికి తరలించడానికి అదనపు అడ్వకేట్ జనరల్ అంగీకరించలేదు. రమేష్ ఆస్పత్రిపై క్రిమినల్ కేసులుఉన్నాయని.. ఆ ఆస్పత్రి నిర్లక్ష్యంతో పది మంది చనిపోయారని వాదించారు. అంతే కాదు.. రమేష్ ఆస్పత్రికి తీసుకెళ్తే టీడీపీ ఆఫీస్‌కు తీసుకెళ్లినట్లేనని చెప్పుకొచ్చారు. అయితే హైకోర్టు మాత్రం విడిగా పిటిషన్ వేసుకోవాలని సూచించింది. కింది కోర్టు ఉత్తర్వులు అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది.
నిజానికి సీఐడీ అధికారులు రఘురామరాజుకు ఇతర చోట్ల వైద్య పరీక్షలు నిర్వహించడానికి సిద్ధంగా లేరు. ముందుగా సీఐడీ కోర్టు ఆదేశాల ప్రకారం జీజీహెచ్‌లో తర్వాత రమేష్ ఆస్పత్రిలోనూ పరీక్షలు చేయించాల్సి ఉంది. రమేష్ ఆస్పత్రిలో టెస్టులు చేస్తే.. భిన్నమైన ఫలితాలు వస్తాయని అనుకున్నారో… లేక గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ఇచ్చే నివేదిక చాలని అనుకున్నారో కానీ..టెస్టులను అంతటితో నిలిపివేశారు. అయితే ఇప్పుడు హైకోర్టు ఉత్తర్వులను సీఐడీ అధికారులు అమలు చేస్తారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.