కరోనా ఎన్నో కుటుంబాల్లో చీకట్లు ముసిరేలా చేస్తోంది. కొన్ని చోట్ల ఇంటి పెద్ద దిక్కును కోల్పోగా.. మరికొన్ని చోట్ల..తల్లిదండ్రులు ఇద్దర్నీ కోల్పోయి చిన్నారు అనాథలవుతున్నారు. ఒకటో.. రెండో కాదు.. దాదాపుగా ప్రతి ఊరిలోనూ ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ పిల్లల ఆలనాపాలనా ఎవరు చూస్తారన్నది ఇప్పుడు పెద్ద సమస్య అయింది. ప్రభుత్వాలు కరోనా గురించే పట్టించుకునే తీరిక లేదు.. ఇక వారి సంగతేమిటన్నది మానవతావాదుల ఆవేదన. ఈ ఆవేదన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్లింది.
కరోనా కారణంగా తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు అనాధలైతే వారిని ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం వారి పేరిట ఫిక్స్ డ్ డిపాజిట్ చేసి దానిపై వచ్చే ఆదాయం ద్వారా పిల్లల పోషణ జరిగేలా చూడాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఎంత ఇవ్వాలి.. ఎప్పుడు డిపాజిట్ చేయాలన్నదానిపై అధికారులు వీలైనంత త్వరగా మార్గదర్శకాలు రూపొందించి.. అమలు చేస్తే.. అనాధలైన పిల్లలు రోడ్డున పడకుండా కాస్తంత భరోసా వస్తుంది. అదే సమయంలో ప్రభుత్వం తరపున ఉచిత వసతి.. ఉచిత విద్య అందేలా చూడాలన్న సూచనలు కూడా ప్రభుత్వానికి అందుతున్నాయి.
కరోనా మహారమ్మారి.. అందర్నీ చుట్టబెడుతోంది. ఎవర్నీ వదిలి పెట్టడం లేదు. ఆర్థికంగా కుంగిపోతున్న కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి. ఆర్థికంగా పెద్ద దిక్కును కోల్పోతున్న కుటుంబాలు వేలల్లో ఉంటున్నాయి. వీటి గురించి ప్రభుత్వాలే పట్టించుకోవాల్సి ఉంది. లేకపోతే.. ఇలాంటి కుటుంబాలు ఏ ఆధారం లేక రోడ్డున పడతాయి.