రఘురామకృష్ణరాజు వ్యవహారంలో పరిణామాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊహించని విధంగా మారినట్లుగా కనిపిస్తున్నాయి. పార్టీ నేతలందరూ ఇతర పార్టీల నేతల్ని తిట్టడానికి తాను మాత్రమే.. విధానాలు మాట్లాడాటానికి అన్నట్లుగా ప్రెస్‌మీట్లు పెట్టే ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సారి కూడా మీడియా ముందుకు వచ్చి… రఘురామకృష్ణరాజు అరెస్ట్ వ్యవహారంతో ప్రభుత్వానికి ఏం సంబంధం లేదని పదే పదే చెప్పడానికి ప్రాధాన్యం ఇచ్చారు. సీఐడీ అధికారులే సుమోటోగా కేసు నమోదు చేశారని.. సజ్జల స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం ఏ దశలోనూ జోక్యం చేసుకోలేదని ఆయన వివరిస్తున్నారు. ఈ అంశాలను ప్రధానంగా చెప్పి.. సీఐడీని సమర్థించడానికి ఆయన రాజకీయాలను తీసుకొచ్చారు. రఘురామకృష్ణరాజు.. చంద్రబాబు చెప్పినట్లు చేస్తున్నారని.. అందుకే ఎక్కువగా స్పందిస్తున్నారని చెప్పుకొచ్చారు.
గతంలో చంద్రబాబు కేసీఆర్‌పైన.. గిడ్డి ఈశ్వరిపైనా రాజద్రోహం కేసులు పెట్టారని సజ్జల సమర్థించుకున్నారు. రఘురామకృష్ణరాజు విషయంలో స్పీకర్ అనర్హతా వేటు వేయకపోవడంపైనా సజ్జల వ్యాఖ్యలు చేశారు. ఎంపీకి మిలటరీ ఆస్పత్రిలో పరీక్షలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంపైనా వ్యాఖ్యలు చేయబోయారు కానీ తమాయించుకున్నారు. సీఐడీ సుమోటోగా కేసు పెట్టినా… ఆ విషయంతో ప్రభుత్వానికి సంబంధం లేదన్నా… కుట్ర మాత్రం జరిగిందని.. సజ్జల అంటున్నారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్ర పన్నారని అంటున్నారు. నిజానికి ప్రభుత్వాన్ని ఎలా అస్థిర పరుస్తారో సజ్జల చెప్పలేకపోతున్నారు. అసాధారణమైన ఎమ్మెల్యేల బలం ఉందియ టీడీపీకి చెందిన ఎమ్మెల్యేల్ని కూడా లాక్కున్నారు.
అయినా ఎలా ప్రభుత్వాన్ని అస్థిర పరుస్తారో చెప్పకుండా కుట్ర కోణాన్ని ఆపాదించేస్తున్నారు. మొత్తంగా సజ్జల చేతుల్లోంచి వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడం.. ధర్డ్ డిగ్రీ ప్రయోగించడం నిజమేనని వైసీపీ నేతల అంతర్గత సంభాషణల్లో ప్రచారం జరుగుతూండటంతో.. రాను రాను పరిణామాలు కీలకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే సజ్జల… సీఐడీనే సుమోటోగా కేసు నమోదు చేసిందని ప్రభుత్వం ఏ దశలోనూ కలుగ చేసుకోలేదని చెబుతున్నారు. నిజానికి అటు పోలీసు శాఖతో పాటు .. ఏసీబీ.. సీఐడీ అన్నీ.. సజ్జల డైరక్షన్‌లోనే పని చేస్తాయని.. ఈ మొత్తం ఎపిసోడ్ ఆయన డైరక్షన్‌లో జరిగిందని.. టీడీపీ నేతలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. దీంతో ముందు జరగబోయే పరిణామాలు ఆసక్తికరంగా మారనున్నాయి.