మీడియాపై కేసులు పెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “సుప్రీంకోర్టు ధిక్కరణ”కు పాల్పడిందని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పిటిషన్ దాఖలు చేసింది. కరోనా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలను విమర్శిస్తూ.. రఘురామకృష్ణరాజు మాట్లాడిన ప్రెస్‌మీట్‌ను ప్రత్యక్షంగా ప్రసారం చేసినందుకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజద్రోహం కేసు నమోదు చేసింది. ఇలాంటి కేసులు నమోదు చేయడం పూర్తిగా సుప్రీంకోర్టు ఏప్రిల్ 30వ తేదీన ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధమని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పిటిషన్‌లో పేర్కొంది.
కరోనాకు సంబంధించిన సమాచారాన్ని చెప్పడం.. షేర్ చేయడం… అలాగే పౌరులు తమ ఆవేదనను సోషల్ మీడియాలో వెల్లడించడం ఏ మాత్రం తప్పు కాదని.. అలా చేయడం నేరం కాదని.. సుప్రీంకోర్టు ఏప్రిల్ 30వతేదీన ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసింది. ఎవరైనా తప్పుడు సమాచారం అని కేసులు పెడితే.. కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకుంటామని.. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మానసం స్పష్టమైన తీర్పు చెప్పింది. ఆ తీర్పును ఉల్లంఘిస్తూ.. ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా తన ప్రెస్‌మీట్లలో కరోనా అంశాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తన అభిప్రాయాలు చెప్పారు. వాటిని ప్రసారం చేసినందుకు ఏబీఎన్ చానల్‌పై కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలు మీడియాను భయపెట్టి… ప్రజా గొంతుకను వినిపించకుండా చేయాలన్న కుట్రతో… పోలీసు అధికారులను ప్రయోగిస్తున్నారని.. మీడియా ప్రసారాలను చట్ట విరుద్ధంగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఏబీఎన్ పిటిషన్‌లో స్పష్టం చేసింది. ఏపీ సర్కార్ ఉద్దేశపూర్వకంగా సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తున్నందున కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేస్తున్నామని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి తన పిటిషన్‌లో తెలిపింది. ఈ పిటిషన్‌లో చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతంసవాంగ్‌లతో పాటు సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్‌లను ప్రతివాదాలుగా చేర్చారు.