కరోనా పాజిటివిటీ రేటులో ఇరవై ఐదు నుంచి ముఫ్పై శాతం మధ్య ఉంటూ అందర్నీ కలవరపెడుతున్న ఆంధ్రప్రదేశ్ . .. తాజాగా మరో మహమ్మారి బారిన పడేటట్లుగా కనిపిస్తోంది. ఎక్కడ చూసినా బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూస్తున్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారిలో ఈ ఫంగస్ ఎక్కువగా వెలుగు చూస్తోంది. దీని బారిన పడిన వారు చాలా వేగంగా చనిపోతున్నారు. శరవేగంగా స్పందించి మెడికేషన్ చేయకపోతే.. శరీర భాగాలు తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మొదట్లో ఈ ఫంగస్‌ను ఎక్కువగా ఉత్తరాదిన ఉందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఏపీలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.
ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో.. వందల్లోనే బ్లాక్ ఫంగస్ అనుమానిత కేసులకు చికిత్స చేస్తున్నారు. చాలా వరకు బ్లాక్ ఫంగసేనని నిర్ధారణ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమయింది. ముఖ్యమంత్రి జగన్ శరవేగంగా స్పందించి… ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆదేశించారు. రేపోమాపో జీవో ఇస్తామని ఆరోగ్య శాఖను చూస్తున్న అశోక్ కుమార్ సింఘాల్ ప్రకటించారు. ఈ లోపే పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. నిజానికి ఈ ఫంగస్ మరో మహమ్మారి అవుతుందన్న ఆందోళనతో కేంద్రం కూడా అప్రమత్తయింది. చికిత్స చేసే మందుల ఉత్పత్తిని పెంచాలని ఆదేశాలు జారీ చేసింది.
బ్లాక్ ఫంగస్ అత్యంత అరుదైనది కావడంతో.. మందుల లభ్యత కూడా తక్కువ ఉంది. అవసరమైన ఇంజెక్షన్లు.. ఇతర మెడికేషన్ కు .. లక్షల్లోనే ఖర్చు అవుతాయి. అందుకే బ్లాక్ మార్కెట్లోకి వెళ్లిపోయాయి. ఇప్పుడు ఏపీలో అనేక మంది పేదలు ఈ బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారు. ప్రభుత్వం వేగంగా స్పందించి.. ఆరోగ్యశ్రీలో చేర్చుతూ జీవో ఇవ్వడమే కాకుండా… ఆస్పత్రులు ఖచ్చితంగా చికిత్సలు చేసేలా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. లేకపోతే… ఏపీ ప్రజలు బాగా ఇబ్బందిపడే అవకాశం ఉంది.