చారిత్రక తప్పిదాలు చేయడంలో కమ్యూనిస్టులు అందునా… సీపీఎం నేతలు ముందు ఉంటారు. ఒకప్పుడు బెంగాల్ సీఎంగా ఉన్న జ్యోతిబసుకు ప్రధానమంత్రిగా ఆఫర్ ఇస్తే.. వద్దని తోసిపుచ్చేసి చారిత్ర తప్పిదం చేశామని నాలిక్కరుచుకున్న కమ్యూనిస్టులు.. దేశంలో తమకు చివరి హోప్‌గా ఉన్న కేరళలోనూ అవే తప్పులు చేస్తున్నారు. కేరళలో ఎన్నడూ లేని విధంగా … ప్రజలు రెండో సారి వరుసగా లెఫ్ట్ ఫ్రంట్‌కు అధికారం కట్టబెట్టారు. ఇప్పటి వరకూ ఓ సారి లెఫ్ట్ ఫ్రంట్‌కు మరో సారి యూడీఎఫ్‌కు అధికారం ఇస్తూ ఉండేవారు. ఈ సారి లెఫ్ట్ ఫ్రంట్కే ఇవ్వడంతో పినరయి విజయన్ రెండో సారి సీఎం అవుతున్నారు.
అయితే ఆయన తనకు పార్టీలో పోటీ ఎవరూ ఉండకూడదని అనుకున్నారో ఏమో కానీ.. గత మంత్రివర్గంలో ఉన్న అందర్నీ తీసి పడేసి.. కొత్త వారితో కేబినెట్ నింపాలని నిర్ణయించుకున్నారు. మొత్తం ముఖ్యమంత్రి కాకుండా పన్నెండు మంది మంత్రులు కొత్తవారే. అయితే ఇదేదో రివల్యూషన్ నిర్ణయం అని సర్ది చెప్పుకోవడానికి లేనంత బంధుప్రీతి.. సమర్థులైన నేతల్ని పక్కన పెట్టడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. పినరయి విజయన్ అల్లుడ్ని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కేరళలో వచ్చిన అనేక సంక్షోభాల సమయంలో… కేకే శైలజ అనే ఆర్థిక మంత్రి సమర్థంగా పని చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. మిగతా వారందరి సంగతేమో కానీ.. తన అల్లుడ్ని కేబినెట్లోకి తీసుకుని శైలజను పక్కన పెట్టడం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. కమ్యూనిస్టుల క్రెడిబులిటీపై మళ్లీ చర్చ జరుగుతోంది.
అంతా కొత్త వారినే తీసుకోవాలనుకుంటే ఒక్క విజయన్ను మాత్రమే ఎందుకు కొనసాగిస్తున్నారన్న ప్రశ్నలూ వినిపిస్తున్నాయి. ఇప్పుడు మాజీ మంత్రి శైలజకు అంతటా మద్దతు లభిస్తోంది. అది విజయన్‌తో పాటు.. సీపీఎంకూ ఇబ్బందికరంగా మారింది. ఇలా చేయడం.. చారిత్రక తప్పిదేమోనని భవిష్యత్‌లో నాలిక్కరుచుకున్నా చేసేదేమీ ఉండదు. ఎందుకంటే అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.