ఓ ఫిల్మ్ మేకర్ కి నిజమైన కిక్ ఎప్పుడొస్తుందో తెలుసా? తనదైన ఓ కథ చెప్పినప్పుడు. అప్పటి వరకూ ప్రేక్షకులు రుచి చూడని ఓ అనుభూతిని ప్రేక్షకులకు పంచినప్పుడు. స్టార్స్‌తో పని లేకుండా ఓ మ్యాజిక్ చేసినప్పుడు. `సినిమా బండి`ని చూడండి. స్టార్ డమ్.. కమర్షియల్ లెక్కలు… ఇవేమీ అంటకుండా తీసిన సినిమా అది. `ఇలాంటి కథలతోనూ సినిమాలు తీయొచ్చా?` అని ఆశ్చర్యపరిచింది. ఆ ఆలోచనకు, కార్యాచరణకు వీరతాళ్లు వేసింది. వర్జినల్ కథలో ఉండే కిక్ అది. అయితే… దాన్ని టాలీవుడ్ క్రమంగా మర్చిపోతోందా? అనే అనుమానాలు వేస్తోంది. ఎందుకంటే.. టాలీవుడ్ ఇప్పుడు నమ్ముకుంటోంది… రీమేకుల్నే.
పక్క భాషలో బాగా ఆడిన కథని రీమేక్ రైట్స్ పేరుతో కొనుక్కుని, ఈ భాషలోనూ తీయడం నేరమేం కాదు. అదో కమర్షియల్ సూత్రం. ఎప్పటి నుంచో ఉన్నదే. స్టార్ హీరోల్లో రీమేక్‌లను నమ్ముకున్నవాళ్లు, హిట్లు కొట్టినవాళ్లు చాలామంది ఉన్నారు. కాబట్టి రీమేకుల్ని తప్పుపట్టకూడదు. కానీ… అసలు సొంత కథలే రాసుకోవడం రాదన్నట్టు… ప్రతీ సారీ, రీమేకుల పంచన చేరడం మాత్రం మన క్రియేటివిటీకి మన చేతులతోనే కళ్లాలు వేసుకున్నట్టే.
చిరంజీవి చేతిలో రెండు రీమేకులున్నాయి. వేదాళం, లూసీఫర్ కథల్ని ఆయన రీమేక్ చేస్తున్నాడు. వెంకీ చేతిలోనూ రెండు రీమేకులున్నాయి. అసురన్, దృశ్యమ్ 2 ఆయన ఖాతాలో ఉన్నాయి. `డ్రైవింగ్ లైసెన్స్` కథపై కూడా వెంకీ మనసు పడ్డాడని టాక్. పవన్ కల్యాణ్ మూడేళ్ల తరవాత ఎంట్రీ ఇస్తూ ఎంచుకున్న కథ… పింక్. ఇప్పుడు `అయ్యప్పయుమ్ కోషియమ్` రీమేక్ చేస్తున్నాడు. చిరు, వెంకీ, పవన్‌లకు రీమేకులు కొత్త కాదు. వాళ్ల కెరీర్లో వాటి సంఖ్య ఎక్కువే వుంది. కెరీర్లో కీలకమైన దశలు దాటుకుని వచ్చి, ప్రయోగాలు చేసి, కొత్త దారుల్ని వెతకాల్సిన సమయంలోనూ రీమేకుల బాట పట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రీమేక్ కథ ఎంచుకున్నారంటే ఒక్కటే కారణం.. రిస్క్ చేయడం ఇష్టం లేక. కథల విషయంలో రాజీ పడలేక. రిస్కులు తీసుకోలేకపోతే.. టాలీవుడ్ కి కొత్త కథలెప్పుడొస్తాయి? ఎందుకొస్తాయి? కెరీర్ పరంగా ఎత్తు పల్లాలన్నీ చూసేశాక, తమకంటూ ఓ స్ట్రాంగ్ మార్కెట్ ఉండి కూడా.. అగ్ర కథానాయకులు రిస్కులు తీసుకోకపోతే.. కొత్తతరం మాటేంటి?
ఇది వరకు రీమేక్‌లంటే ఎవరికీ పెద్దగా కంప్లైంట్లు ఉండేవి కావు. మనకు తెలియని కథ చెబుతున్నారు కదా.. అనుకునేవాళ్లం. ఇప్పుడు అలా కాదు. ఓటీటీల పుణ్యమా అని.. ప్రపంచ సినిమా మొత్తం ఇంట్లోని లాప్ టాప్లలోకి వచ్చేస్తోంది. అమేజాన్‌లో ఉన్న మలయాళం సినిమాలెన్నో. వాటిని సబ్ టైటిల్స్ తో పాటు చూసేస్తున్నారు. `దృశ్యమ్ 2` ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడో చూసేశారు. ఇప్పుడు అదే సినిమాని వెంకీ తీస్తున్నాడు. ఆల్రెడీ దృశ్యమ్ 2 చూసినవాళ్లు.. ఇప్పుడు వెంకీ చేసిన ఈ దృశ్యమ్ ని ఎంత వరకూ ఎంజాయ్ చేస్తారు? ఆ ట్విస్టులు తెలిసిపోయి కూడా అదే థ్రిల్ ఫీలవుతారా? `అసురన్` కూడా అంతే. ఆ సినిమా బాగుందన్న టాక్ వచ్చినవెంటనే.. భాష అర్థం కాకపోయినా.. చూసేశారు మనవాళ్లు. వాళ్లందరికీ.. `నారప్ప` ఎక్కుతుందా?
ఓటీటీలో మనకు కావల్సిన సినిమా చూసుకునే వెసులుబాటు ఉంది. భాష అర్థం కాకపోతే సబ్ టైటిల్స్ సాయం అడగొచ్చు. కొన్ని సినిమాలైతే డబ్బింగ్ వెర్షన్లూ అందుబాటులో ఉన్నాయి. ఇలాంటప్పుడు సైతం… రీమేకుల్ని ఏరి కోరి ఎంచుకుంటున్నారంటే – ఏమనుకోవాలి? పోనీ మాతృక లోని పాయింట్ ని మాత్రమే పట్టుకుని, వాటిని మనదైన శైలిలో ఆవిష్కరిస్తారా అంటే అదీ లేదు. కట్, కాపీ.. పేస్ట్ సూత్రమే అంతా. ఎక్కువగా ఆలోచించి, మార్పులూ చేర్పులూ చేసుకుంటూ వెళ్తే.. అసలు కథ ఎక్కడ గాడి తప్పుతుందో అన్న భయం ఉంది. `రాక్షసన్` లాంటి సినిమాలే చూడండి. చాలా చోట్ల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని సైతం వదల్లేదు. అదీ.. మన వాళ్ల ఆలోచనా తీరు.
ఓ కథ అనుకుని, దానిపై కసరత్తు చేసి, అందులోంచి సన్నివేశాల్ని పుట్టించి – ఆరేడు నెలలు స్క్రిప్టుపై కూర్చునే ఓపిక ఇప్పుడు ఎవరికీ లేదు. అందరికీ ఇన్స్టెంట్ రుచులే కావాలి. హీరో, దర్శకుడు దొరకడమే ఆలస్యం. సినిమాని పట్టాలెక్కించేయడమే. అలాగని రీమేకులన్నీ హిట్టవుతున్నాయా అంటే అదీ లేదు. అందులోనూ ఫట్టుమంటున్న కథలున్నాయి. రిస్క్ ఫ్యాక్టర్ అక్కడా వుంది. కథలు ఫెయిల్ అవ్వకపోయినా, మేకింగ్ విషయంలో ఫెయిల్ అవుతున్నారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగిన కథల్ని ఎంచుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు.
తెలుగులో రైటర్స్‌కి కొదవ లేదు. వాళ్ల ఆలోచనలకు హద్దు లేదు. ఓపిగ్గా వాళ్లతో కూర్చుని, మంచి కథలే రాబట్టొచ్చు. అయితే… అందరికీ రిజల్ట్ ఇన్స్టెంట్ గా ఉండాలి. బడా హీరోలు `రీమేకులేమైనా ఉన్నాయేమో చూడండి` అని దర్శకులకు పురమాయించకుండా, కొత్త ఆలోచనలకు, కొత్త కథలకు ప్రోత్సాహం అందించేందుకు కాస్త మనసు చూపించాలి. మనదైన కథల్ని ఆవిష్కరించే సందర్భం వచ్చినప్పుడు వదలుకోకూడదు. తెలుగులో రీమేకులు ఎక్కువ అన్నది కాంప్లిమెంట్ కాదు. కంప్లైంట్ అని భావించాలి. తెలుగులో వచ్చిన సినిమాల్ని ఇతర భాషల వాళ్లు రీమేకులు చేసుకోవడానికి ఎగబడినప్పుడే.. తెలుగు సినిమా ఎదిగిందని భావించాలి. అలాంటి రోజులు రావాలి. అది కేవలం మన హీరో చేతుల్లోనే ఉంది.