చుండూరు దళితల ఊచకోత మీద.. ఆ కేసులో కోర్టులు ఇచ్చిన న్యాయంపైనా ప్రస్తుతం ఎవరినైనా సుమోటోగా కేసులు పెట్టి అరెస్ట్ చేయగల సూపర్ పవర్ ఉన్న ప్రముఖుడు పి.వి.సునీల్ కుమార్ చాలా గొప్ప కథ రాశారు. ఆ కథకు.. మాజీ చీఫ్ సెక్రటరీ కాకి మాథవరావు లాంటి మేధావులు కూడా అలెక్స్ హేలీ రాసిన రూట్స్ లాంటి గొప్ప కథ అని ప్రశంసించారు. ఆయనే అలా అని పొగిడారంటే.. ఇతర మేధావుల నుంచి ప్రశంశలు రాకుండా ఉంటాయా..?. వచ్చాయి.. బోలెడన్ని వచ్చాయి. ఆ కథ ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకు వచ్చింది. అది చాలా చిన్న కథే. పేరు ” థూ..”..!
కథ సారాంశం ఏమిటంటే.. చుండూరు దళితుల ఊచకోత నిందితులకు శిక్ష పడలేదు. అప్పట్లో చుండూరు ఊచకోత కేసు తీర్పు చెప్పిన న్యాయమూర్తి జస్టిస్ వెంగళరెడ్డి… అంత మందిని నరికినా ఎవరూ ఫిర్యాదు చేయలేదన్న కారణంతో తప్పుడు కేసుగా నిర్ణయించి కేసును కొట్టి వేశారు. తన కులానికి చెందిన నిందితుల్ని కాపాడేందుకు న్యాయమూర్తి అలా అన్యాయంగా తీర్పు చెప్పారని రచయిత భావించారు. దీని ప్రాతిపదికన రచయిత తన ఆవేదనను.. చాలా ప్రభావవంతంగా.. ఇంకా చెప్పాలంటే.. అన్యాయానికి గురయ్యామని భావించే అందరి గుండెలు రగిలేలా… విప్లవానికి సిద్ధమవ్వాలన్నట్లుగా..రాశారు. అందులో పదజాలం అంత గొప్పగా ఉంది. ఆ కథ చదివే ఒక్కొక్కరికి రక్తం సలసలా మరిగిపోతుంది. ఇంతటి అన్యాయమా అని ప్రశ్నించాలని అనిపిస్తుంది. అంత గప్పగా రాశారు రచయిత.
నిజానికి “థూ..” కథలో ఎక్కడా వ్యక్తుల ప్రాధాన్యత లేదు. అక్కడ నిందితులయినా.. బాధితులయినా.. చివరికి న్యాయం చెప్పిన న్యాయమూర్తి విషయంలో అయినా వ్యక్తులకు కథలో ప్రాముఖ్యత లేదు. వారి వారి వర్గాలకే ప్రాధాన్యం ఇచ్చారు. వారెంత తమను అణగదొక్కుతున్నారో.. వారు ఎంత అన్యాయం చేస్తున్నారో చెప్పారు. ఊచకోత కోసిన తమకు న్యాయం దక్కలేదని ఆవేదన చెందారు. అప్పట్లో పరిస్థితులు బట్టి ఆయనకు ఆవేశం పొంగుకొచ్చి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ కథ మారింది.
“ధూ..” కథ చెప్పుకోవాలంటే ఇప్పుడు.. టైటిల్ నుంచే మార్చేయాల్సి ఉంటుంది. తెలంగాణ టైపులో బాంచెన్ దొర అనే పదం ఏమైనా ఆంధ్రప్రాంతంలో ఉంటే.. అదే వాడుకోవాలి టైటిల్‌కు. ఎందుకంటే.. ఆ ఫైర్ మీద కథ రాసిన రచయిత.. తాను ఏ వర్గాన్ని అయితే.. “థూ” అన్నాడో ఇప్పుడు వారి కోసమే.. అన్ని రకాల హద్దులూ దాటిపోతున్నారు. తనకు ఏ రాజ్యాంగం ప్రకారం అయితే.. అంత గొప్పగా సర్వీస్ పోస్టులో ఉండే అవకాశం వచ్చిందో అ రాజ్యాంగాన్ని .. చట్టాలను వారి కోసం దుర్వినియోగం చేస్తున్నారు. వారి గౌరవం కోసం తన గౌరవం పోగొట్టుకుంటున్నారు. అందుకే ఈ కథ ఇప్పుడు వైరల్ అయింది.
అయితే ఆయనేమీ ఉత్తినే “థూ” కథను మార్చుకున్నారని అనుకోవడంలేదు. ఆనాడు తనకు అన్యాయం జరిగిందని.. ఆవేశపడి.. విలువల గురించి కథలు రాశారేమో కానీ.. ఈ రోజు మాత్రం.. తనకు న్యాయం జరుగుతోందని ఫీలవుతున్నారు. తన “విలువ”ను గుర్తించారని నమ్ముతున్నారు. అందుకే ఆయన ఆ కథ మార్చేసుకున్నారు. ప్రతిఫలంగా మేనత్త కొడుక్కి ఎపీఎస్ఎస్సీ మెంబర్ పోస్టులు… ఇతర బయటకు రాని తాయిలాలు బాగానే దక్కుతున్నాయి. బహుశా.. రిటైరైన తర్వాత ఆయన సేవలకు గుర్తింపుగా… ఏదో ఓ రిజర్వుడు నియోజవకర్గం నుంచి ఎంపీ.. ఎమ్మెల్యే టిక్కెట్ కూడా దక్కొచ్చు.
కానీ మరి ఆయన ఆ కథ ఎవరి కోసం రాశారో వాళ్ల పరిస్థితేమిటి..? వారికి న్యాయం ఎప్పటికీ అందని ద్రాక్షేనా..? తాను రాజీపడి.. వారి అన్యాయాన్ని ఎలుగెత్తి చాటి.. వాటినే బలంగా చూపి తాను ఎదిగి.. వారిని మర్చిపోవడంపై …”థూ..” కథకు కొనసాగింపు ఎవరైనా రాస్తే ..!?