ముఖ్యమంత్రులందరూ … పీపీఈ కిట్లు వేసుకునో.. వేసుకోకుండానే కార్యక్షేత్రంలోకి దిగి ప్రజల సాధకబాధలను గుర్తించి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎనభై ఏళ్లకు దగ్గర పడిన కర్ణాటక సీఎం యడ్యూరప్ప దగ్గర్నుంచి నిన్నామొన్న సీఎం అయిన స్టాలిన్ వరకూ అందరూ కరోనా వార్డుల్లో పడి కలియ తిరుగుతున్నారు. ప్రజలకు ఏ కష్టం ఉందో ప్రత్యక్షంగా తెలుసుకుని తాము చేయగలిగినంత చేస్తున్నారు. అధికారులతో ప్రత్యక్ష సమావేశాలు పెడుతున్నారు. కేంద్ర పాలిత ప్రాంతం అయినా.. చిన్న రాష్ట్రం అయినా… పెద్ద రాష్ట్రం అయినా ముఖ్యమంత్రులందరూ దాదాపుగా తమ పని తాము చేస్తున్నారు. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రమే గడప దాటడం లేదు.
ముఖ్యమంత్రి జగన్ మొదటి వేవ్ కరోనా ఉద్ధృతి వచ్చినప్పుడు గడప దాటలేదు.. సెకండ్ వేవ్‌లోనూ అదే పరిస్థితి. ఇంటినే క్యాంప్ ఆఫీసుగా మార్చుకుని సుదీర్ఘ కాలంగా వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. అధికారులందరూ పోలోమని అక్కడికే వెళ్తున్నారు. కీలక నిర్ణయాలన్నీ అక్కడ్నుంచే తీసుకుంటున్నారు. కానీ ప్రత్యక్షంగా ఏం జరుగుతుందో… తెలుసుకునే ప్రయత్నాన్ని మాత్రం ముఖ్యమంత్రి జగన్ చేయడం లేదన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. తిరుపతిలో ఆక్సిజన్ అందక పదకొండు మంది చనిపోయారని సీఎం జగనే స్వయంగా ప్రకటించారు. అంత ఘోర విషాదం జరిగినప్పుడు… తక్షణం ఆ ఆస్పత్రిని పరిశీలించి… ప్రజలకు భరోసా కల్పించాల్సి ఉంది. కానీ అలాంటి ఆలోచనే చేయలేదు.
కరోనా సెకండ్ వేవ్ విజృంభణ తర్వాత ప్రభుత్వం గొప్పగా పని చేస్తోందని.. అన్ని రకాల చర్యలు తీసుకుందని.. వైద్య సేవల విషయంలో అందరూ ఏపీ వైపు చూస్తున్నారని సీఎం జగన్ తో పాటు అధికార పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఈ విషయం అందరికీ తెలియాలంటే.. సీఎం జగన్ ప్రత్యక్షంగా కార్యక్షేత్రంలో పర్యటలు చేయాల్సి ఉంటుంది. కనీసం అందరు ముఖ్యమంత్రులు అదే చేస్తున్నారు… అన్న ఉద్దేశంతో అయినా చేయాల్సి ఉండేది. కానీ ఆయన అలా చేయడం లేదు. దాంతో… ఇప్పుడు సోషల్ మీడియాలో సీఎం జగన్ ఇల్లు దాటడం లేదనే విషయం ట్రెండింగ్ టాపిక్‌గా అయింది. జగన్ తన బాధ్యతల్ని విస్మరిస్తున్నారన్న విమర్శలు సామాన్య జనం నుంచి రావడానికి ఇది కారణం అవుతోంది.