ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ వైఎస్, చైర్మన్ ఎండీగా పని చేస్తున్న రవీన్ కుమార్ రెడ్డి అనే అధికారిని ప్రభుత్వం బదిలీ చేసేసింది. ఆయనను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈ రవీన్ కుమార్ రెడ్డి ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ కాదు. నిజానికి ఏపీఐఐసీ లాంటి కీలక సంస్థకు సివిల్ సర్వీస్ అధికారుల్నే ఎక్కువగా నియమిస్తూ ఉంటారు. కానీ ఏపీ సర్కార్ ఏరికోరి రవీన్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చి నియమించింది. తమకు ఆప్తుడనో.. మరో కారణమో కానీ.. ఆయన ఎక్కడో రైల్వే శాఖలో పని చేసుకుంటూంటే.. లాబీయింగ్ చేసుకుని మరీ ఏపీకి తీసుకొచ్చింది. ఐఏఎస్‌లకు కట్టబెట్టే ఏపీఐఐసీ వైస్ చైర్మన్ , ఎండీ పదవిని ఇచ్చింది.
గత ఏడాది ఆగస్టు నెలాఖరులో రవీన్ కుమార్ రెడ్డి సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వేలో చీఫ్ కమర్షియల్ మేనేజర్‌గా పని చేస్తున్న సమయంలో రైల్వే ఉన్నతాధికారులను ఒప్పించి… ఏపీ ప్రభుత్వానికి డిప్యూటేషన్ పై వచ్చేలా చేసుకున్నారు. వచ్చీ రాగానే ఆయనకు ఏపీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ పోస్ట్ ఇచ్చారు. అంతకు ముందు ఆపోస్టులో ఐఏఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ ఉండేవారు. ఆయన వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. ఎంత సన్నిహితుడు అంటే… వైఎస్ జయంతికి.. వైఎస్ ఇంటినుంచి ఆయనకు కేక్ వస్తుందట.. ఆయనే చెప్పుకున్నారు. అంత సన్నిహితుడైనా… ఆయనను అక్కడ్నుంచి తప్పించేశారు. రవీన్ కుమార్ రెడ్డికి పోస్టింగ్ ఇచ్చారు.
ఇప్పుడు రవీన్ కుమార్ రెడ్డిని కూడా ఆ పోస్ట్ నుంచి తప్పించి… జీఏడీలో రిపోర్ట్ చేయమని ఆదేశించారు. ఆయన సేవలు వద్దనుకుంటే మళ్లీ ఆయన్ను.. రైల్వేస్‌కు పంపిచేంయడానికి కేంద్రానికి అవకాశం ఉంటుంది. అయితే అత్యంత విధేయుల్ని నియమించినా ఏపీఐఐసీలో ఎందుకు ఉండలేకపోతున్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏపీఐఐసీ అంటే.. పరిశ్రమలకు భూముల కేటాయింపు… రాయితీలు ఇవ్వడంలో కీలకం. ఇలాంటి చోట్ల ఎందుకు అధికారులు ఒత్తిడికి గురవుతున్నారో అధికారులకూ ఓ అంచనా ఉంది. ఏపీఐఐసీకి చైర్మన్‌గా రాజకీయ నేతకు ప్రభుత్వం నామినేటెడ్ పోస్టు ఇస్తుంది. ప్రస్తుతం రోజా చైర్మన్‌గా ఉన్నారు. అనారోగ్య కారణంగా కొద్ది రోజులుగా ఆమె ఇంటికే పరిమితమయ్యారు.