2021-22లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బడ్జెట్ రూ. 2,29,779.27 కోట్లుగా ఆర్థిక మంత్రి బుగ్గన ప్రకటించారు. గత ఏడాది కన్నా.. దాదాపుగా ఐదు వేల కోట్లు ఎక్కువ. మొత్తం బడ్జెట్ ప్రసంగం అంతా.. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసే కేటాయింపులే ఉన్నాయి. నేరుగా నగదు అందించే పథకాలకుపెద్ద మొత్తంలో కేటాయించారు. పెన్షన్ కానుకకు రూ. 17,000 కోట్లు కేటాయించారు. రైతు భరోసాకు రూ. 3,845 కోట్లు కేటాయించారు. అయితే… అసలుగా కేటాయించాల్సిన దాని కన్నా ఇది చాలా తక్కువ. ఇక అమ్మ ఒడి కోసం రూ. 6,107 కోట్లు, వైయస్సార్ చేయూత కోసం రూ. 4,455 కోట్లు, విద్యా దీవెనకు రూ. 2500 కోట్లు, వసతి దీవెనకు రూ. 2,223, ఫసల్ బీమా యోజనకు రూ. 1,802 కోట్లు, డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ కింద చెల్లింపులకు రూ. 1,112 కోట్లు, రైతులకు సున్నా వడ్డీ కింద చెల్లింపుల కోసం రూ. 500 కోట్లు కేటాయించారు. నిజానికి సున్నా వడ్డీ కోసం… కనీసం రూ. మూడు వేల కోట్ల వరకూ కేటాయిస్తేనే… రైతులందరికీ ఆ పథకం కింద ప్రయోజనం లభిస్తుంది. కానీ అత్యల్పంగా కేటాయించారు.
ఇతర పథకాలకు కూడా కేటాయింపులు చేశారు. జగనన్న చేదోడు , వాహన మిత్ర, నేతన్న నేస్తంకోసం, మత్స్యకార భరోసా సహా చిన్నా చితకా పథకాలన్నింటికీ నిధులు కేటాయింపు చేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులకోసం రూ. 200 కోట్లు మాత్రమే కేటాయించారు. అధికారంలోకి వచ్చిన మొదటి బడ్జెట్లో 1150 కోట్లు కేటాయించినా విడుదల చేయలేదు. తర్వాత బడ్జెట్లోనూ మొండి చేయి చూపారు. ఇప్పుడు రూ. రెండు వందల కోట్లు మాత్రమే కేటాయించారు. ఇవి కూడా విడుదల చేస్తారన్న గ్యారంటీ లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ అగ్రిగోల్డ్ బాధితులు గత వారం రోజులుగా మొరపెట్టుకుంటున్నా ప్రయోజనం లేకపోయింది. రాష్ట్రానికి మౌలిక సదుపాయాలు పెంచేందుకు చేసే పెట్టుబడి వ్యయం రూ. 40వేల కోట్లు మాత్రమే ఉండనుంది. ఇందులో స్కూళ్లలో, ఆస్పత్రుల్లో నాడు నేడు, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ సహా మొత్తం మౌలిక సదుపాయాల కోసం కేటాయింపులు ఉన్నాయి.
వివిధ పథకాల కింద కాపు సామాజికవర్గ సంక్షేమం కోసం రూ. 3,306 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇలా అన్ని రంగాల వారికి కేటాయింపులు పెంచామని ప్రకటించారు. పిల్లలు, చిన్నారుల కోసం బడ్జెట్లో రూ. 16,748 కోట్లు కేటాయించారు. మహిళల అభివృద్ధికి రూ. 47,283.21 కోట్లు కేటాయించారు. ఈ మొత్తంతోనే ప్రత్యేక బడ్జెట్‌గా ప్రకటించారు. అయితే ఈ మొత్తాలన్నీ వివిధ పథకాల్లో భాగం అందిస్తున్న నిధులే.
ఆదాయ అంచనాలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఆదాయ అంచనాల గురించి బడ్జెట్లో చెప్పలేదు. గత ఏడాది లక్ష కోట్ల అప్పు తెస్తే కానీ.. పథకాలను అమలు చేయలేకపోయారు. ఈ ఏడాది ఎన్ని అప్పులు తెస్తారు. ఎలా తెస్తారు.. రుణాలకు చెల్లించాల్సిన మొత్తం ఎంత … లాంటి వాటిపై పెద్దగా వివరాలు వెల్లడించలేదు.