బడ్జెట్ సమావేశాలు జరిగాయంటే అటు కేంద్రంలోనూ.. ఇటు రాష్ట్రంలోనూ ప్రజలు బడ్డెట్ కోసం ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తాయో.. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్.. కాగ్ ఇచ్చే నివేదిక కోసం.. ప్రజలు ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల నేతలు… మీడియా అంతే ఆసక్తిగా ఎదురు చూస్తాయి. ఎందుకంటే ఆర్థికపరంగా అసలు లెక్కలు అందులోనే తెలుస్తాయి. ఎక్కడెక్కడ తేడా వచ్చిందో గుట్టు బయట పడుతుంది. ఎంత బయటపడినా… రాష్ట్రాలు.. కేంద్రం కాగ్ రిపోర్టుల్ని తొక్కి పట్టే ప్రయత్నం చేయలేదు. దాచి పెట్టే ప్రయత్నం చేయలేదు. తొలి సారిగా ఏపీ ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశ పెట్టలేదు. ప్రవేశపెట్టకపోతే రాజ్యాంగ విరుద్ధం అవుతుందన్న ఉద్దేశంతో ఎప్పుడో రెండేళ్ల కిందట.. 2019 నాటి రెవెన్యూ సెక్టార్ కాగ్ రిపోర్టును అసెంబ్లీలో బుగ్గన ప్రవేశపెట్టారు.
బుగ్గన తీరుపై ఆర్థిక నిపుణుల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కీలకమైన విషయాలను దాచి పెట్టడం సమంజసం కాదని… అది ప్రైవేటు వ్యవహారం కాదని… ప్రజల ముందు ఉంచాల్సిందేననన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. నిజానికి గత ఏడాది ఆర్థిక పరంగా ఎన్నో అవకతవకలు జరిగినట్లుగా ఫిర్యాదులు ఉన్నాయి. రూ. నలభై రెండు వేల కోట్ల బిల్లుల చెల్లింపులకు సంబంధించి అనేక అభ్యంతరాలను కాగ్ ప్రభుత్వం ముందుకు తీసుకు వచ్చిందని.. దానికి సంబంధించిన వివరణలు ఇవ్వడానికి అధికారులు నానా తంటాలు పడుతున్నారని ఇప్పటికే మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఇక ఆదాయం.. అప్పుల వివరాలు కాగ్ రిపోర్టు ద్వారా బయటకు వస్తాయి. ఆ రిపోర్టును ప్రభుత్వం దాచి పెట్టే ప్రయత్నం చేస్తోందంటే… సహజంగానే విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తూంటాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. లేని పోని ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారానికి పులిస్టాప్ పెట్టాలంటే.. కాగ్ రిపోర్టును బయట పెట్టాల్సి ఉంటుంది.