ఎంపీ రఘురామకృష్ణరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారని అదే విద్వేషం అని రాజద్రోహం కేసు పెట్టిన ప్రభుత్వం.. సొంత ఎమ్మెల్యేతో తిట్ల దండకం వినిపించింది. అసెంబ్లీలో పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడేందుకు అవకాశం పొందారు. ఆ అవకాశాన్ని ఆయన పూర్తిగా రఘురామకృష్ణరాజును తిట్టేందుకే వినియోగించుకున్నారు. అత్యంత దారుణమైన భాషలో మాట్లాడారు. వాస్తవానికి సభలో లేని.. సభకు సంబంధం లేని వ్యక్తుల గురించి అసెంబ్లీలో మాట్లాడకూడదు. అదో నైతిక నియమం. కానీ.. జోగి రమేష్ మాత్రం.. ఇష్టారీతిన మాట్లాడారు. అనాల్సిన మాటలు అన్నీ అనేసిన తర్వాత … ఆయనకు నిబంధనలు గుర్తుకు వచ్చాయి.
ఆయన మాట్లాడుతున్నంత సేపు వైసీపీ సభ్యులు చిరు వదనంతో చూస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్ కూడా.. సంతోషంతోనే ఉన్నారు. స్పీకర్ కూడా.. జోగి రమేష్ ఏదో ప్రజా సమస్యపై సీరియస్‌గా మాట్లాడుతున్నట్లుగా చూస్తూ కూర్చున్నారు. అంతా మాట్లాడేసిన తర్వాత జోగి రమేషే.. స్పీకర్‌కు బాధ్యత గుర్తు చేశారు. వేరే సభలో సభ్యుడి గురించి అసెంబ్లీలో విమర్శించడం తప్పు అని తానే చెప్పుకుని.. స్పీకర్‌కు ఓ ఆఫర్ ఇచ్చారు. నేను మాట్లాడినదాంట్లో తప్పుంటే రికార్డుల నుంచి తొలగించాలని.. కోరారు. జోగి రమేష్ ప్రసంగానికి అబ్బురపడిన సీఎం జగన్ కూడా స్పందించారు. జోగి రమేష్‌కు థాంక్యూ చెప్పాలి, అభినందించాలన్నారు.
ఎందుకంటే.. తిట్టిన తిట్లకు ధ్యాంక్యూ… అలాగే..రికార్డుల నుంచి తొలగించాలని స్వయంగా కోరినందుకు అభినందనలు అన్నమాట. జోగి రమేష్ బాధలో ఆప్యాయత కనిపించిందని సీఎం జగన్ వాత్సల్యం చూపించారు. ఇంత జరిగిన తర్వాత కూడా.. ఆ మాటలను రికార్డుల నుంచి తొలగించారో లేదో క్లారిటీ లేదు. మొత్తానికి వైసీపీ బ్రాండ్ అంటే.. ఎక్కడైనా తిట్ల దండకం అందుకోవడమేనని జోగి రమేష్ మరోసారి నిరూపించినట్లయిందన్న విమర్శలు మాత్రం వినిపిస్తున్నాయి.