అళీ – కుళీ – వృశ్చిక – వేణు – రంభా
వినాశకాలే ఫలముద్వహన్తి
యథా తథా సజ్జన – దుర్జనానాం..!
ఈ శ్లోకం అర్థం.. తుమ్మెద, పీత , తేలు , వెదురు , అరటి వంటివి నాశకాలం వచ్చినపుడు బాగా ఫలిస్తాయి. అంటే మంచివాళ్లయినా.. చెడ్డవాళ్లయినా… పోగాలమువేళ విపరీత బుద్ధులు పుడతాయి. అలాగే.. అవన్నీ ప్రత్యుత్పత్తి కాగానే తరువాత ఉండవు. అంటే… అందుకే అవి వినాశకాలము వచ్చినపుడు పండుతాయి. ఇది మనుషులకే వర్తింప చేస్తే వినాశకాలే విపరీత బుద్ధి.. అని చెప్పుకోవాల్సి ఉంటుంది.
వ్యక్తిగత కక్ష తీర్చుకోవడానికి ఎందాకైనా..!?
వినాశకాలు తెచ్చుకోవడానికి ప్రత్యేకంగా విపరీత బుద్దులు తెచ్చుకోవడం అనేది ఇప్పుడు తరానికి అలవాటుగా మారిపోయింది. అధికారం చేతిలో ఉందని.. ఎంతటి వినాశనానికైనా.. ముందూ.. వెనుక చూడకుండా తెగబడటమే ఇప్పటి లక్షణం. ఇది చదువుతున్న ఎవరికైనా… సాధారణ చదువరికి అయినా… రాజకీయాలపై ఆసక్తి ఉన్న వారికైనా.. చివరికి తాము ఎవరికి గురించి చెబుతున్నామో వారి సమర్థకులకు కూడా.. వారికి కూడా ఇది తమ గురించే అని ముందుగానే అర్థమవుతుంది. అంటే.. ఆ వినాశకాలే… తము చేస్తున్నామని వారందరూ గుర్తిస్తున్నట్లుగానే భావించాలి. తెలిసీ వినాశకాలు చేస్తున్నారంటే… పోగాలానికి దగ్గరపడినట్లుగానే తెలుసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. గత వారం ఎంపీ రఘురామకృష్ణరాజును ఆయన ఇంట్లో అరెస్ట్ చేసిన వైనం దేశవ్యాప్త సంచలనం సృష్టించింది. ఈ దేశంలో సాధారణ పౌరులకైనా కొన్ని హక్కులు ఉంటాయి. భారత రాజ్యాంగం వాటిని ఇచ్చింది. దాని ప్రకారం… వారికి జీవించే హక్కు ఉంది. వాక్ స్వాతంత్ర్యం ఉంది. అంతకు మించి వారిని ఇష్టారీతిన అధికారం పేరుతో ఎత్తుకెళ్లిపోవడం లాంటివి చేయకూడదు. అరెస్టులు చేయాలంటే.. దానికో పద్దతి ఉంటుంది. రాజ్యాంగము, చట్టలు వాటిని నిర్దేశించారు. ప్రజలు ఎన్నుకున్న చట్టసభ సభ్యులకు మరిన్ని హక్కులుంటాయి. కానీ రఘురామకృష్ణరాజు అరెస్టులో అవేమీ పాటించలేదు. అసలు ఆయనపై ఎప్పుడు కేసు నమోదు చేశారో కూడా ఎవరికీ తెలియదు. కానీ ఆయన పుట్టినరోజు నాడు హైదరాబాద్‌లో ఉన్నారని తెలుసుకుని ఏకంగా ముఫ్పై మందికిపైగా ఆయన ఇంటిపై విరుచుకుపడి పెడరెక్కలు విరిచికట్టి విజయవాడ తీసుకెళ్లిపోయారు. అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేశారని రాజద్రోహం కేసు పెట్టారు. ఈ వ్యవహారంలో పోలీసులు.. ప్రభుత్వం తీరు మొత్తం రాజద్రోహాన్ని తలపించేలా ఉంది. కస్టడీలో ఓ ఎంపీపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఆ విషయం ఆర్మీ ఆస్పత్రి తేల్చబోతోంది. ఆ తర్వాత ఆస్పత్రికి తరలించాలన్న కోర్టు ఆదేశాలను సీఐడీ పోలీసులు ధిక్కరించారు. అంటే.. మొత్తం వ్యవస్థను ధిక్కరించేశారు. అంతా మా ఇష్టం అన్నట్లుగా చేసేశారు. ఇదంతా వినాశకాలే.. !
పకడ్బందీగా న్యాయవ్యవస్థ నిర్వీర్యానికి పన్నాగం..!
రఘురామకృష్ణరాజు వ్యవహారంలో పోలీసులు.. ప్రభుత్వం వ్యవహరించిన తీరు చూస్తూ.. రాజ్యాంగం .. చట్టాలు.. కోర్టుల గురించి డోంట్ కేర్.. ఆయన్ని శిక్షించాలనుకుంటున్నాం కాబట్టి శిక్షిస్తున్నాం.. మీరెవరు చెప్పడానికి అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరించింది. ఇదే పద్దతని అడిగిన న్యాయమూర్తిని బెదిరింపు ధోరణితో.. గద్దిస్తూ… వారికే ఉద్దేశాలు ఆపాదించే ప్రయత్నాన్ని అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేశారు. ఇది కోర్టు రికార్డులకు ఎక్కింది. నిజంగా ప్రభుత్వ విధానమే అది. ప్రభుత్వం ఓ పద్దతిగా చేస్తోంది. ఏఏజీ .. తాను ధర్మాసనం ముందు చేతలతో చూపించారు. అంటే న్యాయవ్యవస్థను బెదిరించడానికి కూడా… వెనుకాడటం లేదన్నమాట. వ్యక్తుల్ని బెదిరించవచ్చు… కానీ వ్యవస్థను ఎప్పటికీ బెదిరించలేరు. ఈ విషయంలోనూ… అటు ప్రభుత్వం.. ఇటు అధికారులది వినాశకాలే .. !
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయవ్యవస్థపై జరిగిన దాడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఓ రకంగా తమ ప్రభుత్వ అధికారాన్ని.. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ముందుగా… ప్రణాళిక ప్రకారం.. న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేయడానికే ఉపయోగించుకుంటున్నారు. చట్ట, రాజ్యాంగ విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడం.. వాటిని కోర్టులు కొట్టవేస్తే.. కోర్టులదే తప్పన్నట్లుగా వ్యవహరించడం.. చకచకా సాగిపోయాయి. ఏడాదిన్నర పాటు న్యాయస్థానాన్ని వెంటాడారు. కోర్టులపై.. న్యాయమూర్తులపై కుల ముద్ర వేశారు. బెదిరించారు. హెచ్చరించారు. తీర్పులు పాటించకపోతే… న్యాయవ్యవస్థే నిర్వీర్యం అయిపోతుందని చేతలతో చూపించారు. కారణాలు ఏమైతేనేం… చీఫ్ జస్టిస్‌ను మార్చిన తర్వాత పరిస్థితి కుదుటపడుతుందని అనుకున్నారు. ఇప్పుడు అదే పరమ తప్పిదం అయిపోయింది. చీఫ్ జస్టిస్‌ను మార్చడం అంటే… ఏం జరిగినా తమకు అనుకూలంగా తీర్పులు వస్తాయన్న భావనలో అధికార పక్షం పడినట్లుగా ఉంది. కానీ ఏ వ్యవస్థ అయినా… రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది. చట్టం ప్రకారం తీర్పులు చెప్పడం.. న్యాయస్థానాల విధి. అక్కడ న్యాయమూర్తుల విచక్షణ మేరకు తీర్పులు ఉండవు. రాజ్యాంగం ప్రకారమే ఉంటాయి. ఈ విషయం తెలిసి కూడా.. వారి ద్వారా తమ నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయించుకోవాలన్న ఓ పథకం ప్రకారం… వినాశక ప్రయత్నాలు చేశారు. అది ఇప్పుడు పీక్స్‌కి చేరింది. మొదట్లో న్యాయవ్యవస్థ కూడా ప్రభుత్వానికి… మరో రాజ్యాంగ వ్యవస్థ అయిన ఎస్ఈసీకి మధ్య ఏర్పడిన వివాదాలను మధ్యేమార్గంగా పరిష్కరిస్తామని ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చింది. ఎస్ఈసీ ఎన్నికల నిర్వహణలో జోక్యం చేసుకోకూడదని ఎన్నో తీర్పులు ఉన్నా… హైకోర్టు పదే పదే ఆయన చర్యలను నియంత్రించింది. ఈ అడ్వాంటేజ్ ఏమో కానీ…. ఏపీ ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు న్యాయవ్యవస్థను బలహీనం చేసేశామని.. ఇక తాము చెప్పినట్లుగా చేస్తారనని ఆశించారు. కానీ.. విపరీత బుద్దితో వినాశకాలు చేసినప్పుడు తాత్కాలిక ప్రయోజనం మాత్రమే లభిస్తుంది.
తప్పుడు పనులు చేసి జైలుకెళ్తున్న వ్యవస్థల పెద్దలు..!
ప్రభుత్వం విపరీతబుద్ధితో ఆలోచిస్తే… వ్యవస్థలు ఎందుకు వినాశనం కావాలి..? కాకూడదు. కానీ ఇక్కడా ప్రభుత్వ పెద్దలు వ్యూహాత్మకంగానే వ్యవహరించారు. ఆ వ్యవస్థ.. ఈ వ్యవస్థ అని కాదు.. మొత్తం వ్యవస్థల్ని బలహీనపరిచే ప్రయత్నం చేశారు. ఏపీలో ఇప్పుడు సీఐడీ, ఏసీబీ అంటే.. స్వతంత్ర ప్రతిపత్తి సంస్థలు కాదు. ప్రభుత్వ పెద్దల ప్రాపకం కోసం పాకులాడే… కొంత మంది దురాశపరులైన అధికారుల చేతుల్లో ఉన్నాయి. వారు ఏదో చేస్తున్నారని కాదు. ఏమీ చేయకుండా.. తమ వ్యవస్థను రాజకీయంగా వాడుకునేందుకు రాజకీయ వ్యవస్థలోని వ్యక్తులకు అప్పగించడమే వారు చేస్తున్న తప్పిదం. సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్… తనతంటకు తాను ప్రభుత్వంపై కుట్ర అని.. ఓ ఎంపీ ప్రెస్మీట్లలో మాట్లాడే మాట్లను చూపించి.. కేసు నమోదు చేసి.. రాత్రికి రాత్రి ఆయన్ను అరెస్ట్ పేరుతో ఎత్తుకొచ్చేసే సాహసానికి ఒడిగట్టారంటే పరిస్థితి ఎలా మారిపోయిందో సులువుగా అర్థం చేసుకోంచ్చు. ధూళిపాళ్ల విషయంలో ఏసీబీ వ్యవహరించిన తీరు కళ్ల ముందే ఉంది. ఓ దశలో N-440కే రకం వైరస్ గురించి.. చెప్పారంటూ చంద్రబాబును అరెస్ట్ చేయడానికి ఓ ప్రత్యేక బృందం హైదరాబాద్‌కు వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకో కానీ వెనక్కి తగ్గారు కానీ.. లేకపోతే ఈపాటికి చంద్రబాబును అరెస్ట్ చేసి ఉండేవారు. అధికార పార్టీ నేత అంబటి రాంబాబు లాంటి చంద్రబాబును కూడా అరెస్ట్ చేసి… రఘురామకృష్ణరాజును కొట్టినట్లుగా కొడతామని నేరుగా బెదిరింపులకు దిగారంటే.. వ్యవస్థలు ఎవరి చేతుల్లో ఉన్నట్లో సులువుగానే అర్థం చేసుకోవచ్చు.
ఐదేళ్లే రాజకీయ నేతలు… అధికారులు శాశ్వతం..! ఎందుకిలా చేస్తున్నారు…?
అందరూ నిబంధనలకు అనుగుణంగా పని చేస్తే ఎలాంటి సమస్యలూ రావు. కానీ ఆ నిబంధనలు తమకు మాత్రం వర్తించవని అనుకుంటేనే సమస్య వస్తుంది. ఏపీలో అధికార పార్టీ తీరు అంతే ఉంది. చట్టాలు… రాజ్యాంగాలు తమకు మాత్రం వర్తించవని.. మొత్తంగా ఇతరులకు మాత్రమే వర్తిస్తాయన్నట్లుగా వ్యవహరిస్తోంది. సోషల్ మీడియాలో వైసీపీ నేతలు ఎవరినైనా ఇష్టారీతిన తిట్టవచ్చు. అసత్యాలు ప్రచారం చేయవచ్చు. కానీ ఇతర పార్టీల నేతలు నిజాలు ప్రసారం చేసినా… పోస్ట్ చేసినా అది నేరం. వారిని రాజద్రోహం కింద అరెస్ట్ చేసేయవచ్చు. అలాగే.. చంద్రబాబు సహా ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే.. వారిపై కేసులు పెట్టవచ్చు. కానీ అవే.. సొంత పార్టీ వాళ్లు చేస్తే మాత్రం ఎలాంటి కేసులు ఉండవు. నిజానికి ఇది వాళ్ల తప్పు కాదు.. వ్యవస్థను నడుపుతున్న అధికారులదే. రాజకీయ అధికారాలకు గులాం కొట్టి… చట్టాన్ని రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నవారిదే తప్పు. తప్పులు చేసి కోర్టుల ముందు నిలబడుతున్నా వారి తీరులో మార్పు రావడం లేదు. ముస్సోరిలో వారుకు ఏం నేర్పించారో.. వారి సర్వీస్‌లో ఎన్ని విలువలను నెలకొల్పాలో ఎవరికీ అర్థం కాని పరిస్థితి.
అధికారులు న్యాయస్థానం ముందు నిలబడటం తప్పు కాదు. న్యాయ నిర్ణయానికి దోహదపడటమే అది . కాని న్యాయవాది ద్వారా కాకుండా , తామే వచ్చి వివరణ ఇవ్వాలని కోర్టు చెప్పిందంటే ఆలోచించుకోవలసిన అంశమే. అంతే కాకుండా అనుమానితులుగా బోను ఎక్కడమంటే ఇంకా ఎక్కువగా ఆలోచించుకోవాలి. అంతకు మించి ఆరోపణలు ఎదుర్కుంటూ బోను ఎక్కడమంటే వారు అన్ని రకాల హద్దులనూ దాటేసినట్లే్. సివిల్ సర్వీస్‌లకు ఎంతో తెలివయిన వారు మాత్రమే ఎంపిక అవుతారని మనకు తెలుసు . మరి అంతటి గొప్ప వారు ఎందుకు ఇలా అవుతున్నారు. ముస్సోరీలో అందరకీ.. మాక్స్ వెబర్ ధీయరీ ఆఫ్ బ్రూరోక్రసీని ఒంట బట్టించి పంపుతారు. ఆ ధీయరీ మౌలిక పునాదులు అన్నీ తెలిసిన వారే వ్యవస్థల పతనంలో కీలక పాతర్ పోషిస్తున్నారు మంత్రులు , ముఖ్యమంత్రులు , ప్రధానమంత్రులు జీవితాంతం పదవుల్లో ఉండరు . కానీ అధికారులు ఉంటారు. సివిల్ సర్వీస్ అధికారులు తాము చట్టానికి.. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్లాలనుకున్నప్పుడు మ్యాక్స్ వెబల్ ధీయరీని గుర్తు చేసుకుంటే .. దేశానికి నష్టం చేయకుండా ఉన్న వాళ్లవుతారు. వారు కష్టాల్లో పడరు . కోర్టు ముందు నిలబడటం , బోను ఎక్కడం , శిక్షకు గురికావడం ఉండవు.
ఒకప్పుడు రాజు ప్రజలకు సేవకుడిని అని భావించే వాడు . ప్రజాస్వామ్య భారతంలో కూడా చానాళ్ళు ఇలాంటి నాయకులనే చూశాం .ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అన్నింటిలోనూ అతి చేరింది. రాజకీయ అధికారం క్రిమినల్ మైండ్స్ ఉన్న వారి చేతుల్లోకి వెళ్లడంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. అయితే.. ఎప్పటికైనా… వ్యవస్థ గొప్పతనం తేలుతుంది. అప్పుడైనా వారికి వినాశకాలే విపరీతబుద్ధి అనే నిజం తెలుస్తుంది. దానికి ఎంతో దూరం ఉండదు.