ఒక్క రోజు అసెంబ్లీలో ఏపీ ముఖ్యమంత్రి… సభా నాయకుడు జగన్మోహన్ రెడ్డి సరికొత్త సంప్రదాయాన్ని నెలకొల్పారు. అదే… తన ఇష్టం లేని రాజకీయ నేతల్ని బండబూతులు తిట్టించి.. చివరికి వారితోనే… రికార్డుల నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేయించడం. ఎంపీ రఘురామకృష్ణరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఇవి విద్వేష పూరిత వ్యాఖ్యలని చెబుతూ రాజద్రోహం కేసు పెట్టారు. అదే వైసీపీ ఎమ్మెల్యే సాక్షాత్తూ శాసనసభలోనే అంత కంటే దారుణమైన భాషను రఘురామపై ప్రయోగించారు. అసెంబ్లీ సమావేశాలు చూస్తున్న వారు… మనం వింటున్నది నిజమేనా … అని తమను తాము గిల్లి చూసుకోవాల్సిన భాష. వైసీపీ నేతలు ప్రెస్మీట్లలో టీడీపీ నేతలపై వినిపించే నాటు తెలుగు కన్నా దారుణమైన పదాలు అందులో ఉన్నాయి.
జోగి రమేష్ ప్రసంగానికి.. ఆయన లాంగ్వేజ్‌కు ముఖ్యమంత్రి జగన్ అబ్బురపడ్డారు. ఆ ప్రసంగానికి మాత్రమే కాదు.. జోగి రమేష్ పాటించిన విలువలకు కూడా.. సీఎం జగన్ అచ్చెరువొందారు. ఆ విలువులకు సలాంచేశారు. ఆయన తీరు చూసి.. పార్లమెంటరీ సంప్రదాయాల గురించి బాగా తెలిసిన వాళ్లు కూడా… ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. అన్నన్ని మాటల్ని అసెంబ్లీలో అనిపించడం ఎందుకు.. ఆ తర్వాత మళ్లీ రికార్డుల నుంచి తీసేయమన అడగడం ఎందుకని ఆ డౌట్. ఇంత జరిగిన తర్వాత కూడా.. ఆ మాటలను రికార్డుల నుంచి తొలగించారో లేదో క్లారిటీ లేదు.
వైసీపీ నేతలు ఇంటా బయటా… అలాగే పవిత్రమైన అసెంబ్లీలోనూ అలాంటి భాషను రెండేళ్ల నుంచి మాట్లాడుతున్నారు. రాజకీయ ప్రత్యర్థుల్ని అలా తిడితే ఏమొస్తుందో కానీ.. గతంలో కాస్త డిగ్నిటీ ప్రదర్శించేవారు కూడా ఆ పార్టీలో చేరిన తర్వాత దారుణమైన భాషను మాట్లాడుతూంటారు. అయితే.. అక్కడ హైకమాండ్‌ను మెప్పించాలంటే.. అలాగే మాట్లాడాలని వైసీపీ నేతలు చెబుతూ ఉంటారు. అలా మాట్లాడిన వారికే ప్రోత్సాహం ఉంటుందని కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ భాషను అసెంబ్లీలోకీ తీసుకు వచ్చారు. దానికి ముఖ్యమంత్రి తనదైన శైలిలో పార్లమెంటరీ ప్రాక్టీస్‌గా మార్చేశారు.