మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు చెల్లవని హైకోర్టు తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం నాలుగు వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉండగా ఇవ్వలేదని అందు వల్ల ప్రక్రియనురద్దు చేస్తున్నట్లుగా హైకోర్టు తీర్పు చెప్పింది. కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో గతంలో జరిగిన పరిషత్ ఎన్నికలు.. ఓటింగ్ వృధాయేనని అంచనా వేస్తున్నారు. ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అది హైకోర్టులో డివిజన్ బెంచ్‌కు వెళ్తారా.. సుప్రీంకోర్టుకు వెళ్తారా అన్నది తేలాల్సి ఉంది.
గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ పెట్టనందుకు .. ఏప్రిల్ ఒకటో తేదీన కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఇచ్చిన నోటిఫికేషన్‌ను సింగిల్ జడ్జి నిలుపుదల చేశారు. దానిపై హుటాహుటిన డివిజన్ బెంచ్‌లో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన ప్రభుత్వం…పరిషత్ ఎన్నికలు నిర్వహించుకోవచ్చని.. అయితే కౌంటింగ్ మాత్రం జరపొద్దని హైకోర్టు డివిజనల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఆ సమయంలోనే సింగిల్ జడ్జి వద్దకే వెళ్లి పిటిషన్ పరిష్కరించుకోవాలని డివిజన్ బెంచ్ సలహా ఇచ్చింది. దీంతో మళ్లీ సింగిల్ జడ్జి దగ్గరకే ఆ పిటిషన్ వచ్చింది.సింగిల్ జడ్డి ధర్మాసనం తన పాత తీర్పునకే కట్టుబడ్డారు.
మళ్లీ నిబంధనల ప్రకారం.. నాలుగు వారాల సమయం ఇచ్చి.. ఆ తర్వాత ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం మళ్లీ డివిజన్ బెంచ్‌కు వెళ్లి అనుకూలంగా తీర్పు తెచ్చుకోవడమే ఆప్షన్‌గా ఉంది. అయితే.. అక్కడ ఎలాంటి ఫలితం వస్తుందన్నదానిపైనా మండల.. జిల్లా పరిషత్ ఎన్నికల భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ఒక వేళ సింగిల్ జడ్జి తీర్పును సమర్థిస్తే… మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను మళ్లీ నిర్వహించాల్సి ఉంటుంది. కరోనా సమయంలో… ఇప్పుడల్లా ఎన్నికలు పెట్టే పరిస్థితి లేదు.