ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాజీ అవబోతున్నారు. ఆయన పదవీ కాలం రోజుల్లోకి వచ్చేసింది. మళ్లీ మండలి సమావేశాలు జరిగే లోపే ఆయన రిటైరవుతున్నారు కాబట్టి.. ఆయనకు ఒక్కరోజు మండలి భేటీలో సన్మానం కూడా చేసి పంపేశారు. ఇప్పుడు.. సోము వీర్రాజు ఇక ఏపీ బీజేపీ అధ్యక్షుడిగానే ఉంటారు. మరో ఏడాది తర్వాత ఆయనకు ఆ పదవి ఉంటుందో ఉండదో తెలియదు కానీ.. మళ్లీ ప్రజాప్రతినిధి అయ్యే చాన్స్ ఉందా లే్దా అన్నదానిపై మాత్రం బీజేపీలో చర్చ జరుగుతోంది. ప్రజల్లో నిలబడి గెలవడం అనేదాన్ని ఊహించడం సాధ్యం కాదు కాబట్టి ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ ఎంపీ కోసం ట్రై చేయాల్సి ఉంటుంది. ఎమ్మెల్సీ ఇవ్వాలంటే… వైసీపీ దయతలవాల్సి ఉంటుంది. సోము వీర్రాజు సై అంటే.. వైసీపీ తరపున ఎమ్మెల్సీ ఇవ్వడానికి ఆ పార్టీ నేతలు సిద్ధంగానే ఉంటారు. కానీ సోము వీర్రాజు అలాంటి పని ఇప్పుడల్లా చేయకపోవచ్చు. ఇక హైకమాండ్ ఎంపీ సీటు ఇచ్చేంత పెద్ద నాయకుడు కాలేదు. ఎన్నికల్లో నిలబడి గెలిచేంత సామర్థ్యం ఇంకా రాలేదు.
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి టీడీపీతో పొత్తు పెట్టుకున్న నలుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ తర్వాత టీడీపీ ఖాతాలోకి రావాల్సిన ఓ రాజ్యసభ సీటును ఇచ్చారు. అడిగారు కదా అని ఎమ్మెల్యే కోటాలో ఓఎమ్మెల్సీ సీటును ఇచ్చారు. విశాఖ గ్రాడ్యూయేట్ స్థానం నుంచి మాధవ్‌ని నిలబెడితే.. టీడీపీ నేతలే బాధ్యత తీసుకుని గెలిపించారు. ఈ ప్రకారం.. మొత్తంగా నాలుగు ఎమ్మెల్యే, రెండు ఎమ్మెల్యే సీట్లు ఆ పార్టీ ఖాతాలో ఉండేవి. గత ఎన్నికల్లో టీడీపీ గుడ్ బై చెప్పడం… లోపాయికారీగా కూడా వైసీపీ సహకరించకపోవడంతో నాలుగు ఎమ్మెల్యే సీట్లు కాదు కదా.. డిపాజిట్లు కూడా రాలేదు. ఇప్పుడు మిగిలిన రెండు ఎమ్మెల్సీ సీట్లు కూడా ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
ఇప్పుడు సోము వీర్రాజు రిటైరైతే.. రెండేళ్లలో విశాఖ ఎమ్మెల్సీ మాధవ్ కూడా.. రిటైరవుతారు. అప్పుడు అటు శాసనసభలోనూ.. ఇటు మండలిలోనూ… ఎలాంటి ప్రాతినిధ్యం లేని పార్టీగా బీజేపీ మిగులుతుంది స్థానిక ఎన్నికల్లో కనీస ప్రభావం చూపలేకపోయిన బీజేపీ ఇప్పుడు.. ఏపీలో ఉనికి లేని స్థితికి చేరుకుంటుంది . కేంద్రంలో అధికారంలో ఉన్నామన్న పవర్‌తో ఇక్కడ భారీ స్టేట్మెంట్లు ఇవ్వడమే కానీ.. పార్టీని బలపర్చుకునే కనీస ప్రయత్నాలు చేయకపోవడంతో బీజేపీ పరిస్థితి నానాటికి తీసికట్టుగా అవుతోంది.