వరుణ్‌తేజ్ కొత్త సినిమా `గని`. కిరణ్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం అవుతున్నాడు. దాదాపుగా మూడొంతులు షూటింగ్ కూడా పూర్తయిపోయింది. అయితే ఇప్పుడు ఈ సినిమాపై కొన్ని పుకార్లు వ్యాపించాయి. హీరోకీ – దర్శకుడికీ మధ్య గ్యాప్ వచ్చిందని, అందుకే ఈ సినిమా ఆగిపోయిందని, నిర్మాతలు కూడా ఈ సినిమా విషయంలో అసంతృప్తిలో ఉన్నారని, అందుకే ఈ సినిమా కోసం వేసిన 50 లక్షల సెట్ ని, ఒక్క రోజు షూట్ కూడా జరపకుండా తీసేశారని… ఓ గాసిప్ వెబ్ సైట్ కథనాలు అల్లేసింది. హీరోకి కథ నచ్చలేదని, కొత్తగా మార్పులు చెప్పాడని, దర్శకుడికి ఆ మార్పులు చేయడం ఏమాత్రం ఇష్టం లేదని వార్తలు రాసేసింది. దీనిపై తెలుగు 360 ఆరా తీసింది. అసలు విషయాల్ని రాబట్టింది.
* సెట్ సంగతేంటి?
ఈ సినిమా కోసం హైదరాబాద్ లో ఓ భారీ సెట్ వేసిన మాట నిజం. ఒక్క రోజు కూడా షూటింగ్ చేయకుండా…. ఆ సెట్ ని పక్కన పెట్టింది కూడా నిజమే. `గని` అనే కాదు. దాదాపుగా అన్ని సినిమాల కోసం వేసిన సెట్స్‌ని ఇలానే తీసి పక్కన పెట్టేశారు. దాని వెనుక ఉన్న కారణం వేరు. సాధారణంగా స్టూడియోలోని ఫ్లోర్లు అద్దెకు తీసుకుని సెట్స్ నిర్మిస్తుంటారు. అందుకోసం రోజు వారీ అద్దె చెల్లించాల్సి ఉంటుంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగులు ఆగిపోయాయి. అలాంటప్పుడు ఖాళీ సెట్స్‌ని అలానే ఉంచేస్తే.. రోజువారీ అద్దెలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఆ భారాన్ని భరించడానికి నిర్మాతలెవరూ సిద్ధంగా ఉండరు. అందుకే సెట్ ని తీసేసి, ఆ ప్రాపర్టీ మొత్తం స్టూడియో ఆవరణలోనే ఉంచేసుకుంటారు. షూటింగులు మళ్లీ మొదలైతే.. ఆ సెట్ ని పునఃనిర్మించి వాడుకుంటారు. అలా అద్దెలు కలిసొస్తాయి. `గని` అనే కాదు..దాదాపు పెద్ద పెద్ద సినిమాల కోసం వేసిన సెట్స్ అన్నీ ఇలానే తీసి పక్క పెట్టారు. ఆ మాత్రానికే షూటింగు ఆగిపోయిందని, గొడవలు జరుగుతున్నాయని కథనాలు అల్లేస్తే ఎలా?
* వరుణ్ హ్యాపీ
హీరోకీ దర్శకుడికీ మధ్య క్లాష్ వచ్చిందన్నది మరో పాయింట్. ఇప్పటి వరకూ షూటింగు అంతా సజావుగానే జరిగింది. ఇలాంటి విపత్కర పరిస్థితులలోనూ వరుణ్ – కిరణ్ ఇద్దరూ టచ్‌లోనే ఉన్నారు. ఇటీవల `గని` రషెస్ చూసిన నిర్మాతలు ఫుల్ ఖుషీలో ఉన్నారు. అరవింద్ సైతం ఈ రషెష్ చూసి `హీరోగా వరుణ్ ని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లే సినిమా అవుతుంద`ని జోస్యం చెప్పాడు. ఈ విషయాన్ని `గని` సినిమాకి పనిచేస్తున్న ఓ కీలకమైన టెక్నీషియన్… తెలుగు 360కి చెప్పారు. బిజినెస్ పరంగానూ… చిత్రబృందం పూర్తి సంతృప్తితో ఉంది. ఏరియాలు, ఓటీటీ, శాటిలైట్.. ఇలా ఏరకంగా చూసినా, వరుణ్ గత సినిమాల కంటే ఎక్కువే పలుకుతోంది. ఇటీవల ఓటీటీ డీల్ కూడా క్లోజ్ చేసినట్టు ఇన్‌సైడ్ వర్గాల టాక్. రికార్డు ధరకు ఈ సినిమాని ఓటీటీకి అమ్మేశార్ట. మిగిలిన ఏరియా రైట్స్ కూడా దాదాపుగా క్లోజ్ అయ్యాయని టాక్.
* మళ్లీ షూటింగ్ ఎప్పుడు?
ఈ సినిమాకి సంబంధించి 30 నుంచి 40 రోజుల షూటింగ్ పెండింగ్ లో ఉంది. జూన్ 14 నుంచి షూటింగ్ మొదలెట్టాలన్నది చిత్రబృందం ఆలోచన. అప్పటికి పరిస్థితులు అనుకూలిస్తే… తప్పకుండా ఆ డేట్ కి షూటింగ్ మొదలవుతుంది. క్లైమాక్స్‌లో బాక్సింగ్ ఎపిసోడ్ దాదాపుగా 20 నిమిషాల పాటు సాగబోతోందని తెలుస్తోంది. ఆ 20 నిమిషాలూ… తెలుగు సినిమా ప్రేక్షకులు ఇది వరకు చూడని బాక్సింగ్ ఎడ్వైంచర్ చూపించబోతున్నార్ట. ఈ ఎపిసోడ్ కోసం ఫారెన్ ఫైటర్ల అవసరం ఉంది. ప్రస్తుతానికి… విదేశాల నుంచి ఫైటర్లు రావడం గగనంగా మారింది. జూన్ సమయానికి పరిస్థితులు చక్కబడితే.. ఫారెన్ నుంచి ఫైటర్లు రావడానికి మార్గం సుగమం అవుతుంది. వైజాగ్, హైదరాబాద్, డిల్లీ.. తదితర ప్రదేశాల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది గని టీమ్. ఓ ఫారెన్ షెడ్యూల్ బాకీ ఉంది. విదేశాల్లో షూటింగ్ అంటే ఇప్పుడు కష్టతరమైన విషయం. పరిస్థితులు బాగుంటే.. ఫారెన్ షెడ్యూల్ ఉంటుంది. లేదంటే ప్రత్యామ్నాయం ఆలోచిస్తారు.