నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ హఠాన్మరణం.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం ఉదయమే ఆయన చనిపోయినా… మీడియాకు సమాచారం లేదు. రాత్రి సమయంలో తెలియడంతో ఒక్క సారిగా గగ్గోలు రేగింది. కరోనా మొదటి వేవ్ సమయంలో నర్సీపట్నం ఆస్పత్రిలో అనస్థీషియా వైద్యునిగా ఉన్న డాక్టర్ సుధాకర్ ఎన్-95 మాస్కులు ఇవ్వడం లేదని.. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అప్పట్నుంచి ఆయన టార్గెట్ అయ్యారు. మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో ఆయనను సస్పెండ్ చేసి కేసులు పెట్టారు. అప్పుడు వైద్యుడు చేసిన ఆరోపణలు సంచలనం రేకెత్తించాయి.
ఆ తర్వాత కొన్ని రోజులకు… విశాఖలో ఓ రోడ్డుపై అర్థనగ్నంగా పోలీసులు కొట్టుకుంటూ సుధాకర్ ను ఆస్పత్రికి తీసుకెళ్తున్న దృశ్యాలు వెలుగు చూశాయి. అనూహ్యంగా ఆయనను మానసిక ఆస్పత్రికి తరలించి.. పిచ్చివాడనే ముద్రవేయడానికి ప్రయత్నం జరిగినట్లుగా ఆరోపణలు వచ్చాయి. చాలా రోజుల పాటు సుధాకర్ ను ఆస్పత్రిలోనే నిర్బంధించారు. చివరికి ఈ ఘటనలో.. డాక్టర్ సుధాకర్ కు.. హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఓ వైద్యుడి విషయంలో ఇలా వ్యవహరించడం వెనుక పెద్ద కుట్ర ఉందని అనుమానిస్తూ… సీబీఐ విచారణకు ఆదేశిస్తూ నిర్ణయం తీసుకుంది.
డాక్టర్ సుధాకర్ అరెస్ట్.. తదనంతర పరిణామాలపై రెండు నెలల పాటు చేసిన దర్యాప్తులో కుట్ర కోణం ఉందని.. గతంలో సీబీఐ గుర్తించింది. మొదట ఈ కేసు విచారణకు హైకోర్టు.. సీబీఐకి.. ఎనిమిది వారాల గడువు ఇచ్చింది. ఈ లోపు దర్యాప్తు చేసిన సీబీఐ… మధ్యంతర నివేదికను… హైకోర్టుకు సమర్పించింది. కుట్రకోణం దాగి ఉందని.. మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని.. మరింత సమయం కావాలని అడిగింది. దీంతో హైకోర్టు మరో నెల సమయం ఇస్తూ.. నిర్ణయం తీసుకుంది. ఆ సమయం కూడా ముగిసింది. సీబీఐ సీల్డ్ కవర్లో రిపోర్టును ధర్మాసనానికి సమర్పించింది. దీనిపై విచారణ జరిగి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
తనకు జరిగిన అన్యాయంపై పోరాడిన డాక్టర్ సుధాకర్.. చివరికి న్యాయం దక్కకుండానే కన్నుమూశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఆయనపై టీడీపీ ముద్ర వేశారు.. పిచ్చి ముద్ర వేశారు.. ఇంకా అనేక రకాలుగా హింసించారు. చివరికి… ఆయన ప్రాణం కోల్పోయారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వారికి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో.. ఆయన సాక్ష్యంగా మిగిలిన జ్ఞాపకంగా మారారు.