రఘురామకృష్ణరాజు అంశాన్ని గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకున్నామా అన్న సందేహం ఇప్పుడు వైసీపీ అగ్రనేతల్లో ప్రారంభమయింది. జాతీయ స్థాయిలో రఘురామ రాజు అరెస్ట్… తదనంతర పరిణామాలు హైలెట్ అయ్యాయి. సొంత ఎంపీని అరెస్ట్ చేసి ధర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న ఓ రకమైన ప్రచారం.. దేశం మొత్తం పాకిపోయింది. ఉన్న ఇమేజ్‌కు తోడు.. ఈ అరాచకం ఏమిటన్న అసహనం.. వైసీపీ పెద్దల్లో ప్రారంభమయింది. రఘురామకృష్ణరాజు ప్రతిపక్ష ఎంపీ కాదు.. సొంత ఎంపీనే. ఆయనను ట్యూన్ చేసుకోడం పెద్ద విషయం కాదు. ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి ఆకర్ష్ ప్రయోగించి… వైసీపీలోకి లాక్కొని మరీ టిక్కెట్ ఇచ్చారు. ఆయన మొదటి నుంచి విశ్వాసంగానే ఉన్నారు.
రఘురామకృష్ణరాజు.. తన స్థాయికి తగ్గ గౌరవాన్ని మాత్రమే కోరుకున్నారు. కానీ.. వైసీపీలోని ఇతర నేతల వల్ల… హైకమాండ్‌కు రఘురామరాజుకు మధ్య గ్యాప్ పెరిగిపోయింది. జగన్ అపాయింట్మెంట్లు కూడా దక్కకుండా చేయడంపై చాలా సార్లు రఘురామరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతర పార్టీ సమావేశాల్లోనూ తనకు గౌరవం దక్కకపోవడంతో ఆయన బాగా ఇబ్బందిపడ్డారు. ఇతర ఎంపీల్లా… చెప్పింది మాట్లాడి.. మిగతా సమయాల్లో వ్యాపారాలు చూసుకోవాలన్నట్లుగా ఉండటం ఆయనకు నచ్చలేదు. ఈ పరిస్థితిని సర్దుబాటు చేయాల్సిన పార్టీని చక్కదిద్దే పెద్దలు.. ఏ మాత్రం సర్దుబాటు చేయకుండా.. గ్యాప్‌ను మరింత పెంచే ప్రయత్నం చేశారు. అది చినికి చినికి గాలివానగా మారింది.
రఘురామరాజును.. సాత్వికంగా డీల్ చేసి ఉంటే.. ఆయన పార్టీని ధిక్కరించేవారు కాదు. కానీ.. ఆయనపై అధికారం అండతో ఎటాక్ చేయడం… వైసీపీ ట్రేడ్ మార్క్ అయిన బూతులతో విరుచుకుపడటంతో ఆయన కూడా అదే పంధాలో సమాధానం చెప్పడం ప్రారంభించారు. సహజంగానే మంచి మాటకారి .. విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి కావడంతో రఘురామకృష్ణరాజు.. చెలరేగిపోయారు. ఆ గ్యాప్ వైసీపీ.. రాజు మధ్య అలా పెరిగిపోయింది. మధ్యలో ఉన్న సలహాదారులు మరింతగా మంట రాజేశారు. ఫలితంగా ఇప్పుడు… ఆయన బెయిల్ రద్దు పిటిషన్ వేసి పోరాడేదాకా వెళ్లింది. అక్కడా దారి తప్పిన వ్యూహమే అవలంభించారు. అరెస్ట్ చేయించి.. మరింత దారుణమైన పరిస్థితిని తెచ్చుకున్నారు.
ఇప్పుడు… రఘురామకృష్ణరాజు వ్యవహారంలో అసలేం జరిగిందన్నదానిపై వైసీపీలో రివ్యూ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఆయనను ఎందుకు కెలికి అంతపెద్ద ఇష్యూగా చేశారన్న చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారంలో మొత్తంగా ఓ సలహాదారు వైపే అన్ని వేళ్లూ చూపిస్తున్నాయంటున్నారు. టీడీపీ నుంచి ఎమ్యెల్యేల్ని ఆకర్షించి.. రఘురామకృష్ణరాజు కంటే దారుణంగా టీడీపీ నేతల్ని తట్టించిన వైనం.. ప్రజలు గుర్తుంచుకోరా… అన్న చర్చ కూడా నడుస్తోంది. మొత్తానికి వైసీపీలో ఓ సమీక్ష అయితే ప్రారంభమయిందని అంటున్నారు. దీనికి బాధ్యులెవరని అధినేత గుర్తిస్తే.. వారికి ముందు ముందు గడ్డు పరిస్థితి ఏర్పడవచ్చని అంటున్నారు.