సీఎం అయిన తర్వాత కేసీఆర్ ఎన్నికల ప్రచారాలకు మాత్రమే బయటకు వచ్చారు. జిల్లాల పర్యటనలు చేస్తా.. చేస్తా అంటారు కానీ ఎప్పుడూ చేయలేదు. అయితే హఠాత్తుగా ఇప్పుడు ఆస్పత్రులను చుట్టేస్తున్నారు. మొన్న గాంధీలో.. నిన్న వరంగల్ ఎంజీఎంలో కలియదిరిగారు. ఈ పర్యటనలు ఇంతటితో ఆగవని.. కొనసాగుతూ ఉంటాయని.. చెబుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖను ఈటల నుంచి తీసేసుకున్న కేసీఆర్.. సగం బాధ్యతల్ని కేటీఆర్‌కి.. మరో సగం హరీష్ రావుకు అనధికారికంగా అప్పగించారు. అయితే ఇప్పుడు.. ఈశాఖపై తన ముద్ర వేయాలనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వ పరంగా కరోనా విషయంలో ప్రజలకు అండగా ఉన్నామన్న సంకేతాలను స్వయంగా పంపడానికి రంగంలోకి దిగారని అంటున్నారు.
ప్రైవేట్ హాస్పిటల్స్‌కి దీటుగా ప్రభుత్వ వైద్యాన్ని తీర్చిదిద్దాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని.. ఎలాంటి మార్పులు చేయాల్సి ఉందో.. స్వయంగా పరిశీలిస్తున్నారని అంటున్నారు. కరోనా పాజిటివ్ రేట్ తగ్గడం తో బ్లాక్ ఫంగస్ ని ఎదుర్కొనెలా ఇప్పటికే అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తిసుకుంటున్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో అన్ని రకాల వసతులను ప్రభుత్వం ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి పక్షాలు మాట్లాడకుండా చేయడం తో పాటు ప్రజలకు వైద్యం అందించే దిశగా ముందుకు వెళ్లొచ్చు అనే అభిప్రాయం తో ఉంది ప్రభుత్వం.
అన్ని ఉమ్మడి జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులను చూసిన తర్వాత ఆరోగ్యశాఖ అధికారులతో పాటు ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. అప్పుడు ఆయన సంచలన నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది. కొన్ని వందలు..వేల కోట్లు పెట్టి ఆస్పత్రులను మెరుగుపర్చే ప్రణాళికను అమలు చేస్తారని అంటున్నారు. సామాన్య ప్రజలను కలిసేందుకు ఇష్టపడని ముఖ్యమంత్రి కేసీఆర్ అని విపక్షాలు ఆరోపిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు.. కోవిడ్ రోగుల దగ్గరకు వెళ్లి మరీ మాట్లాడుతున్నారు. రాజకీయ వ్యూహాల్లో కేసీఆర్ ను ఎవరూ దాటలేరని.. ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయని విపక్ష నేతలే గొణుక్కుంటున్నారు.