కథానాయకుడిగా నాగార్జున కెరీర్ 100 సినిమాలకు చేరుతోంది. సెంచరీ సినిమా అంటే అందరికీ ప్రత్యేకమే. వందో సినిమాలో సమ్ థింగ్ స్పెషల్ ఉండేలా జాగ్రత్త పడతారు. అయితే ఆ మైలు రాయి గురించి నాగ్ ఎప్పుడూ మాట్లాడలేదు. `వంద ఓ అంకె మాత్రమే` అన్నది నాగ్ ఆలోచన. అయితే నాగార్జునకు డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. అదే.. `సినిమా మ్యూజియం`. సినిమాకు సంబంధించిన జ్ఞాపకాలన్నీ ఓ చోట భద్రపరచాలనుకుంటున్నార్ట. అందుకు సంబంధించిన కసరత్తు ఎప్పుడో ప్రారంభమైపోయింది. లాక్ డౌన్, కరోనా వల్ల.. ఈ ప్రాజెక్టు ఆగింది. లేదంటే ఈపాటికి అందుబాటులోకి వచ్చేసేది.
అపుపూరమైన పాత సినిమాలు, ఆయా సినిమాల్లో వాడిన కాస్ట్యూమ్స్, కెమెరాలు, ఇతర సాంకేతిక సామాగ్రి ఇలాంటివన్నీ… ఓచోటకు చేర్చాలన్నది నాగ్ తాపత్రయం. ముందుగా అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాల్ని, ఆయన కాస్ట్యూమ్స్‌ని సేకరించి, వాటిని ఓచోటకు చేర్చాలని భావిస్తున్నారు.ఆ పని చాలా వరకూ పూర్తయ్యింది కూడా. అయితే ఈ మ్యూజియం ఎక్కడ నిర్మిస్తారు? అన్నది కీలకంగా మారింది. అన్నపూర్ణ సెవన్ ఏకర్స్‌లో గానీ, అన్నపూర్ణ స్టూడియోలోని గ్లాస్ హౌస్ ని గానీ, మ్యూజియానికి కేంద్రంగా వాడుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఓ మంచి రోజు చూసుకుని ఈ మ్యూజియంని ప్రారంభించే అవకాశం వుంది.