వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో.. ప్రభుత్వంలో ఇప్పుడు పవర్ ఫుల్ ఎవరు..? అంటే.. ఇంకెవరు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే అని అందరూ ఘంటాపథంగా చెబుతారు. కానీ… నిజానికి ముఖ్యమంత్రి మూల విరాట్గనే మిగిలారని… అసలు సూపర్ పవర్ సజ్జల రామకృష్ణారెడ్డినేనని ప్రభుత్వంతో పాటు పార్టీలోనూ చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి దృష్టికి అన్ని విషయాలు వెల్లడం లేదని.. చివరికి ముఖ్యమంత్రి ప్రెస్మీట్లలో ఏం మాట్లాడాలో కూడా సజ్జలే రాయించి ఇస్తున్నారని.. మిగతా వ్యవహారాల్నీ సజ్జలే చక్క బెడుతున్నారని దాని వల్లే ఎదురు దెబ్బలు తగులుతున్నాయన్న అభిప్రాయం ఆ పార్టీలో.. ప్రభుత్వంలో వినిపిస్తోంది.
సజ్జల కేవలం ముఖ్య సలహాదారుమాత్రమే. కానీ ఆయన ముఖ్యమంత్రి తరపున ప్రకటనలు చేసేస్తూ ఉంటారు. దాదాపు ప్రతి రోజూ ప్రెస్మీట్లు పెడుతున్నారు. పరిషత్ ఎన్నికల రద్దుపై హైకోర్టు తీర్పు దగ్గర్నుంచి రఘురామ బెయిల్ వరకూ అన్నింటిపైనా మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతున్నవి హైలెట్ అవుతున్నాయి. అయితే చాలా మందికి ఒకటే డౌట్.. ఈ విషయాలన్నీ మాట్లాడటానికి ఆయనెవరు..? సలహాదారు అయితే… మాట్లాడేయవచ్చా..? ప్రభుత్వంలో అధికారికంగా ఏం పదవి ఉంది..? అనేది వారి అనుమానం. సలహాదారులు.. సలహాలు మాత్రమే ఇస్తారు కానీ ఇలా మీడియా ముందుకు వచ్చి ఎందుకు రచ్చ చేస్తారనేది చాలా మంది వ్యక్తం చేసే సందేహం. దీన్నే విపక్ష నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు.
ఇక ప్రభుత్వంలోనూ సజ్జల చెప్పిందే వేదం. ఏ అధికారిని బదిలీ చేయాలి.. ఏ అధికారిని ఎక్కడ పోస్టింగ్‌లో ఉంచాలో అనే దగ్గర్నుంచి ఆర్థిక పరమైన వ్యవహారాలు మొత్తం ఆయనే చూసుకుంటున్నారని చెబుతున్నారు దీంతోప్రభుత్వంలోని అత్యంత కీలక శాఖ అధికారులు ఎప్పుడో డమ్మీ అయ్యారు. తన మనుషుల్ని కొంత మందిని కింది స్థాయిలో వివిధ విభాగాల్లో నియమించుకుని వారి ద్వారానే పనులు పూర్తి చేస్తున్నారు. కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శలు.. కేవలం సంతకాలకే పరిమితమయ్యారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక అత్యంత కీలకమైన పోలీసు శాఖ పూర్తిగా ఆయన గుప్పిట్లో ఉందని .. అందరికీ నమ్మకం. చివరికి పోలీసు అధికారుల సంఘం ప్రెస్నోట్లు కూడా ఆయన అధీనంలోనే ఉంటాయని.. వారు సంతకాలు పెట్టి ఖాళీ నోట్ ప్యాడ్లు ఇస్తే… వాటిపై సజ్జల కార్యాలయంలో ప్రింట్ చేసి మీడియాకు విడుదల చేస్తారని చాలా రోజులుగా చెబుతున్నారు.
సజ్జల డామినేషన్ వల్ల.. అటు ప్రభుత్వంలోనూ.. ఇటుపార్టీలోనూ అనేక సమస్యలు వస్తున్నాయన్న అభిప్రాయాలు ఇప్పడిప్పుడే బయటపడుతున్నాయి. ప్రభుత్వంలో కొంత మంది ఆయన చెప్పిన మాట వినడం లేదు. ఈ కారణంగా రాత్రికి రాత్రి.. రెడ్డి సామాజికవర్గ అధికారుల్ని అయినా సరే ఇంటికి పంపేస్తున్నారు. రవీన్ కుమార్ రెడ్డి అనే అధికారిని రైల్వేస్ నుంచి తీసుకొచ్చి మరీ చెప్పినచోట సంతకాలు చేయలేదని వెనక్కి పిలిపించేశారు. ఇక పార్టీలోనూ అదే పరిస్థితి. తమను పట్టించుకోవడం లేదని.. విజయసాయిరెడ్డి వర్గమంటూ కొంత మందిని దూరం పెట్టారని.. సోషల్ మీడియాలో కొంత మంది లేఖలు పోస్ట్ చేస్తున్నారు. మొత్తానికి సజ్జల పూర్తిగా అటు ప్రభుత్వంలోనూ.. ఇటుపార్టీలోనూ కాలు పెట్టి.. రగడకు కారణం అవుతున్నారు. ఇది జగన్ కు తేడాగా అనిపించే వరకూ సజ్జల డామినేషన్ నడుస్తుందని.. తర్వాత నెంబర్ టూ ప్లేస్‌లోకి మరొకరు వస్తారని చెబుతున్నారు.