టీకా విధానంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు. ప్రైవేటు ఆస్పత్రులకు టీకాలు ఇవ్వడమే జగన్మోహన్ రెడ్డి అసంతృప్తికి కారణం. టీకాల కొరత ఉందంటూనే ప్రైవేటు ఆస్పత్రులకు ఇస్తున్నారని .. దాని వల్ల ప్రైవేటు ఆస్పత్రులు.. ఒక్క డోసుకు రూ. రెండు వేల నుంచి రూ. పాతిక వేల వరకూ దోచుకుంటున్నాయని ఆయన లేఖలో ఆరోపించారు. ప్రస్తుతం బయట ఎవరికీ టీకాలు వేయలేని పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రం లభ్యమవుతూండటం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతుందని జగన్ లేఖలో తేల్చి చెప్పారు.
ఏపీలో టీకాల పరిస్థితిని కూడా జగన్ లేఖలో వివరించారు., నలభై ఐదేళ్లు నిండిన వారికే పూర్తి స్థాయిలో టీకాలు వేయలేకపోతున్నామని… పద్దెనిమిదేళ్లు నిండిన వారికి టీకా కార్యక్రమం ప్రారంభించలేకపోయామన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర మార్గదర్శకాల ప్రకారమే టీకాలు పంపిణీ చేయాలని జగన్ లేఖలో కోరారు. జగన్మోహన్ రెడ్డి అసంతృప్తికి కారణం ఉంది. ఏపీలో టీకాల పంపిణీ చాలా మందకొడిగా సాగుతోంది. రెండో డోస్ పూర్తిగా వేయలేకపోతున్నారు. ప్రభుత్వం టీకా కంపెనీలకు ఆర్డర్లు పెట్టకపోవడం వల్ల… కంపెనీల నుంచి రాక కూడా తగ్గిపోయింది. ఈ అంశంపై విపక్షాలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి.
మరో వైపు కేంద్రం.. టీకాల భారాన్ని కొంచెం కొంచెంగా తగ్గించుకుంటోంది. టీకాలు తయారు చేసే కంపెనీలు కేంద్రానికి సగం ఇచ్చేస్తున్నాయి. వాటినే కేంద్రం జనాభా దామాషాగా రాష్ట్రాలకు ఉచితంగా ఇస్తోంది. కానీ అవి చాలా తక్కువ. మిగతా యాభై శాతంలో నలభై ఐదు శాతం రాష్ట్రాలు కొనుగోలు చేయవచ్చు. ఐదు శాతం ప్రైవేటు ఆస్పత్రులకు అమ్ముకోవచ్చు. ఆ ఐదు శాతం నుంచేప్రైవేటు ఆస్పత్రులు కొనుగోలు చేసి.. తమ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచాయి. వీటిపైనే ప్రధానంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇవ్వొద్దంటున్నారు.
ఏపీ సర్కార్ వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లు పిలిచింది. కానీ స్పందన వస్తుందో లేదో తెలియదు. అదే సమయంలో దేశంలో తయారయ్యే వ్యాక్సిన్ల కొనుగోలుకు ఆర్డర్లు పెట్టలేకపోయారు. ఇతర రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఆర్డర్లు పెట్టి.. తరలించుకు వెళ్తున్నారు. ఏపీ సర్కార్ మాత్రం.. లేఖలు రాసింది. కేంద్రానికి కూడా లేఖలు రాస్తోంది. కానీ టీకాల సమస్య పరిష్కారానికి మాత్రం ప్రత్యేకమైన కార్యాచరణను రూపొందించుకోలేకపోయారన్న విమర్శలు మాత్రం ఎదుర్కోవాల్సి వస్తోంది.