ఓ మిట్టమధ్యాహ్నం వేళ. ప్రొడ్యూసరు ఇంట్లో ఫోన్ మోగింది.. అవతల డైరెక్ట్రు స్పీకింగు…
“హలో..“
“సార్… చెప్పండి“
“గుడ్ న్యూసయ్యా… మన సినిమా ఓకే అయిపోయింది… బాబు డేట్లు ఇచ్చేస్తానన్నాడు.. మనం ప్రిపేర్ అయిపోవడమే…“ ఆవలిస్తూ అన్నాడు డైరెక్ట్రు.
“సంతోషం.. మరి కథ…“
“కథా… నువ్వేలోకంలో ఉన్నావయ్యా ప్రొడ్యూసరూ.. కథేంది కథ.. మన సినిమాలో కథ కూడా ఉందన్న బ్యాడ్ టాక్ వస్తే.. ఎవడు కొంటాడు చెప్పూ..?“
“అదేందిసార్.. కథంటూ ఒకటుండాలి కదా.. లేదంటే..“
“కథలూ కాకరకాయలూ అంటూ కూర్చుంటే ఎలా.. కాంబినేషన్ సెట్టవ్వడమే ఎక్కువ..“ డైరెక్ట్రు గొంతు కాస్త ఖంగుమంది.
“అది కాదూ… ఏదో ఒకటి అనుకుంటే మంచిది కదా..“ నసిగాడు నిర్మాత.
“సరే ఐతే…. మొన్నామధ్య ఓ తమిళ సినిమా చూశానన్నాను కదా.. దాని రీమేక్ రైట్స్ కొనేయ్.. అదే తీసేద్దాం..“
“అది అట్టర్ ఫ్లాపైంది కదండీ… అది తీస్తానంటే ఎట్టా..“
“ఫ్లాపా..? సినిమా హిట్టయ్యేంత వరకూ మనోళ్లెక్కడ ఆగుతున్నారు .. ట్రైలర్ చూసిన వెంటనే కర్చీఫులు వేసేస్తున్నారు కదయ్యా. ఇక ఫ్లాపులే మిగిలాయి… అర్జెంటుగా ఏదో రేటుకి కొనేయ్.. లేదంటే దాన్ని కూడా మిగల్చరు..“
“కానీ మన నేటివిటీ.. అదీ చూసుకోవాలి కద సార్..“
“ఏందయ్యో… నువ్వు మరీ బ్లాక్ అండ్ వైట్ సినిమా రోజుల్లోనే ఉండిపోయావ్.. సరే ఓ పని చేద్దాం. ఆ సినిమాలో హీరో.. పంచెలేసుకునే ఉంటాడయ్యా… మనం ఫ్యాంటూ షర్టూ వేద్దాం. తమిళంలో హీరో పంచె వేసుకోవడం, తెలుగులో హీరో పంచ్ డైలాగులు చెప్పడం ఇదే కదా నేటివిటీ అంటే. హీరోయిన్ చేత తెలుగులో నాలుగు డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పిస్తే.. సరి నేటివిటీ తమిళనాడు బోర్డరు దాటుకుని మరీ వచ్చేస్తుంది…“
“మీ ఇష్టం సార్…. మరి మ్యూజిక్ డైరెక్టర్ని కూడా ఓ మాట అనేసుకుంటే..“
“మళ్లీ మ్యూజిక్కంటావేంటి? తమిళ ట్యూన్లే వాడేద్దాం.. ఆర్.ఆర్ అంటూ లేని పోని హైరానా పెట్టుకోవొద్దు. అక్కడి బీజియంలే కొట్టించేద్దాం. మనం మళ్లీ ఓ మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకున్నా.. వాడూ అక్కడ్నుంచే ఎత్తుకొచ్చేస్తాడు.. ఆనక కాపీ ట్యూన్లంటూ రివ్యూ రైటర్లు గోలేట్టేస్తారు.. ఏమంటావ్…“ అన్నాడు లా పాయింట్ పట్టుకుంటూ.
డైరెక్ట్రు చెప్పింది నిజమే అనిపించింది ప్రొడ్యూసరుకి. ఇక మ్యూజిక్కు సంగతి తేలిపోయింది.
“ఆ పాటల కోసం రైటర్ల చుట్టూ తిరిగే పని తప్పింది. మా బామ్మర్థి ఉన్నాడు కదా.. పాటలు రాస్తా.. రాస్తా.. అంటూ తెగ ఇదైపోతున్నాడు“
“మీ బామ్మర్ది గారా..“ అనుమానంగా అడిగాడు ప్రొడ్యూసర్.
“ఏందయ్యా వాడికేం తక్కువ…? తెలుగే కాస్త రాదంతే. అయినా తెలుగు పాటల్లో తెలుగు ఎక్కడుంది.. అన్నీ ఇంగ్లీషు ముక్కలే కదా.. ఆ పాట్లేవో వాడు పడతాడులే. మనం పాటకో లకారం ఇస్తే సరి..“
ప్రొడ్యూసరు నెత్తిన పిడుగు పడినట్టైంది. ఇక ఏమన్నా.. డైరెక్టరు లొంగే రకం కాదని…
“హీరోయిన్ ని వెదికి పట్టుకుంటే సరి..“ అన్నాడు కాస్త రిలాక్డ్స్గా.
“ఆ బెంగ కూడా తీరిపోయింది. తమిళంలో చేసిన హీరోయిన్నే దించేద్దాం.. అక్కడి షాట్లు కూడా వాడేయొచ్చు. కాల్షీట్లు, బడ్జెట్టూ కలిసొస్తాయ్.. పైగా బాబుకి ఆ హీరోయిన్ తో చేయాలని ఎప్పట్నుంచో ఇంట్రస్టు…“ అన్నాడు రొమాంటిక్ ఊహల్లో తేలిపోతూ.
చివరి పాయింటు.. ప్రొడ్యూసరు బుర్రకి ఎక్కలేదు గానీ, కాల్షీట్లు కలిసొస్తాయ్ అన్న మాట మాత్రం ప్రొడ్యూసరుకి నచ్చింది. మొదటి సారి డైరెక్టరు తన గురించి కూడా ఆలోచిస్తున్నందుకు.. కాస్త సంతోషమేసింది.
“నువ్వు మళ్లీ… రైటర్ని పెట్టుకుని డబ్బులు ఖర్చు పెట్టుకోకు.. ఆ డైలాగులు కూడా నేనే రాసేస్తాలే.. నా రెమ్యునరేషన్ కాస్త పెంచివ్వు చాలు… “ అంటూ… మళ్లీ ఎసరెట్టేశాడు.
ప్రొడ్యూసరుకి పొలమారింది.
“డైలాగులు బాగుంటే.. బాగుంటుంది కదా. మీరేందుకు మళ్లీ చేయి చేసుకోవడం“ అంటూ కంగారు పడ్డాడు.
“డైలాగు రైటర్లంతా ఏం చేస్తారయ్యా.. అక్కడ తమిళంలో సొల్లితే.. ఇక్కడ తెలుగులో ట్రాన్లేట్ చేస్తారు అంతేకదా.. అసిస్టెంట్ డైరెక్టరుగా ఉన్నప్పుడు నేనూ.. పాండీబజార్ గల్లీల్లో తిరిగినవాడ్నే. ఆ మాత్రం తమిళం నాకూ వచ్చు.. నేను ట్రాన్స్లేట్ చేస్తాగా..“ అని లేని పోని ధీమాని కలిగించడానికి ప్రయత్నించాడు డైరెక్ట్రు.
డైలాగ్ రైటర్ ఖాతాలో మరో నాలుగు లకారాలు.. డైరెక్ట్రుకి సమర్పించుకోవాలన్నమాట.
“హీరో లేని సీన్లన్నీ… తమిళంలోనివే వాడేద్దాం..“
“సగం సినిమా తీస్తే చాలు.. మిగిలిన సగం.. తమిళంలోనిదే. కట్ అంట్ పేస్ట్ అన్నమాట“ అన్నాడు బిగ్గరగా నవ్వుతూ.
అవతల ప్రొడ్యూసరు మౌనంగా ఉన్నాడు.
“ఏంటయ్యా.. ప్రొడ్యూసరు.. ఏదో ఆలోచిస్తున్నావ్.. పేమెంటు గురించా.. ముందు అడ్వాన్సు పంపు.. తరవాత చూసుకుందాం లే..“
“అదేం లేదుసార్… ఇప్పుడే ఓ బృహత్తరమైన ఆలోచన వచ్చింది. అన్ని పాట్లు పడి, మీకు అన్ని కోట్లు ఇచ్చి.. ఆ హీరోని బతిమాలుకుని, ఈ హీరోయిన్ కాళ్లు పట్టుకుని, మీ బామ్మర్దిని భరించి.. ఆ సినిమాని రీమేక్ చేయడం ఎందుకు.. డబ్బింగ్ చేసేస్తే పోలా.. నాలుగు డబ్బులు మిగులొస్తాయ్… ఇక సెలవు..“ ఫోను కట్టయ్యింది.
ఈసారి డైరెక్టరుకి పొలమారింది.