ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తెలంగాణలోకి రానిచ్చేందుకు తెలంగాణ సర్కార్ ఆసక్తి చూపడం లేదు. అక్కడ పాజిటివిటీ రేట్ ఎక్కువ ఉండటమో… మరో కారణమో కానీ.. లాక్ డౌన్ సడలింపు సమయం అయిన ఉదయం ఆరు నుంచి పది గంటల వరకు కూడా… సరిహద్దుల్ని క్లోజ్ చేసేశారు. హైకోర్టు తీవ్ర హెచ్చరిక చేయడంతో అంబులెన్స్‌లను మాత్రం అనుమతిస్తున్నారు. ఇతర వాహనాలకు మాత్రం పాస్‌లు ఉంటే మాత్రమే తెలంగాణలోకి అనుమిస్తున్నారు. నిన్నటి వరకూ… ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు ఎలాంటి పాస్‌లు.. చెకింగ్స్ ఉండేవి కావు. కానీ ఇప్పుడు మాత్రం… అడ్డంగా బారీకేడ్లు పెట్టి ఆపేస్తున్నారు. పాస్‌లు ఉంటేనే అనుమతిస్తున్నారు.
ముందస్తుగా ఎలాంటి సమాచారం లేకపోవడంతో పెద్ద ఎత్తున ఏపీ నుంచి వాహనాలు తెలంగాణ సరిహద్దులకు వచ్చాయి. అర్థరాత్రి నుంచే మొత్తం సరిహద్దుల్ని మూసేసిన పోలీసులు.. ఒక్క సూర్యాపేట నుంచి మాత్రమే హైదరాబాద్‌లోకి అనుమతిస్తున్నారు. అక్కడ కూడా.. పాస్‌ల రూల్ పెట్టారు. దీంతో చాలా మంది గత ఏడాది పరిస్థితిని గుర్తు చేసుకుంటున్నారు. గత ఏడాది.. ఏపీ సర్కార్ తెలంగాణ నుంచి ప్రజల్ని రాకుండా అడ్డుకుంది. నిజానికి తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేవారు అంతా… ఆంధ్రా వాళ్లే అయినప్పటికీ.. వైరస్ వ్యాప్తి అవుతుందన్న కారణంగా ప్రభుత్వం నిలిపివేసింది. అప్పట్లో తెలంగాణ ఎలాంటిపాస్ల సిస్టం పెట్టలేదు.
ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఏపీలో లాక్ డౌన్ సడలింపు సమయం ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఎలాంటి పాస్‌లు లేకుండా వెళ్లిపోవచ్చు. ఆ తర్వాత రాకపోకలు సాగించాలంటే.. పాస్‌లు తీసుకోవాలి. అందుకే అందరూ ఆ సమయంలోపు సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు కూడా…తెలంగాణ నుంచి ఏపీకి వెల్లడానికి మధ్యాహ్నంపన్నెండు గంటల వరకూ ఎలాంటి సమస్యా లేదు. కానీ తెలంగాణలోకి రావడం మాత్రం దుర్లభం అవుతోంది. ముందస్తుగా సమాచారం లేపోవడంతో పాస్‌లు తీసుకోవాలనే సంగతి కూడా తెలియక చాలా మంది సరిహద్దులకు వచ్చేశారు. కొన్ని వందల వాహనాలు.. కిలోమీటర్ల కొద్దీ నిలబడి ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కారం చూపించేందుకు ఏపీ వైపు నుంచి ఎలాంటి ప్రయత్నాలూ జరగడం లేదు.