ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ పాలన ప్రారంభమై రెండేళ్లవుతున్న సందర్భంగా ఎవరెవరికి ఎంత మేలు చేశామో.. వివరిస్తూ.. లెక్కలు విడుదల చేస్తోంది. మీడియాకు సమాచారం ఇస్తోంది, ఈ క్రమంలో రైతులకు రెండేళ్లలో రూ. ఎనభై వేల కోట్లు అందించామని.. ప్రభుత్వం ఘనమైన ప్రకటన చేసింది. అందులో రైతుల కోసం పెట్టిన పథకాలన్నింటినీ వివరించారు.
రెండేళ్లలో ఒక్కో రైతుకు లక్షన్నర.. ! నిజంగా ఇచ్చారా..?
అన్ని పథకాల కింద.. రూ. 85వేల కోట్లను అచ్చంగా రైతులకు మాత్రమే ఇచ్చామని.. దీని ద్వారా రైతు కుటుంబాలు… ఆర్థికంగా అభివృద్ధి సాధించాయని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలోప్రభుత్వం అర్హులైన లబ్దిదారులుగా చేర్చిన రైతు కుటుంబాల సంఖ్య దాదాపుగా యాభై ఐదు లక్షల వరకూ ఉంటుంది. ఇటీవల… రైతు భరోసా కింద నగదు బదిలీని ఆ యాభై ఐదు లక్షల కుటుంబాలకే చేశారు. వీరినే ఆమోదిత రైతులుగా గుర్తిస్తే.. ప్రభుత్వ ప్రకటన ప్రకారం.. ఒక్కో కుటుంబానికి ఏటా రూ. 75 వేలు ఇస్తున్నట్లుగానే లెక్కించాల్సి ఉంటుంది. రూ. లక్షన్నర మొత్తం అంటే చిన్న మొత్తం కాదు. రెండేళ్లలో ఇచ్చారు కాబట్టి.. సగటున ఏడాది లెక్క వేస్తే.. ఏటా రూ. 75వేల రూపాయలు ఒక్కో రైతు కుటుంబానికి అందుతున్నట్లుగా ప్రభుత్వం చెబుతోంది. నిజానికి ఈ సొమ్ము ద్వారా.. చాలా వరకూ రైతుల కష్టాలు తీరిపోతాయని అనుకోవచ్చు.
రైతు భరోసా తప్ప రైతుకు అందిన ప్రయోజనం ఏమిటి..!?
అయితే నిజంగా ఒక్కో రైతు కుటుంబానికి ఏటా రూ.75వేలు వస్తున్నాయా… రెండేళ్లలో రూ. లక్షన్నర ఒక్కో కుటుంబం అందుకుందా.. ప్రభుత్వం చెప్పే లెక్కలు నిజమేనా అన్న దానిపైనే ఇప్పుడు చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం రైతు భరోసా కింద రైతులకు నేరుగా రూ. 7500 మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ సొమ్ము ఇస్తోంది. కేంద్రం మూడు విడతలుగా ఇచ్చే రూ. ఆరు వేలను.. ప్రభుత్వ ఖాతాలో వేసుకుని రూ. 13500 అని లెక్క చెబుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చామని చెబుతోంది కాబట్టి..రూ. 7500 ను మాత్రమే లెక్కించాలి. ఇక నేరుగా రైతులకు నగదు బదిలీ పథకం ఏమీ లేదు. మేనిఫెస్టోలో ఉచిత బోర్ల పథకం దగ్గర్నుంచి అనేకం పెట్టారు కానీ.. ఏదీ అమలయిన దాఖలాలు లేవు. బోర్లు వేసే వాహనాలను ప్రారంభించారు కానీ… ఒక్కరికి కూడా లబ్ది చేకూర్చినట్లుగా ఇప్పటికి వరకూ చెప్పలేదు.
రైతుల పంటను కొనడం వారికి ఉచితంగా ఇచ్చినట్లా..!?
అయితే ప్రభుత్వ లెక్కల ప్రకారం… రైతులు పండించిన ధాన్యం కొనడం కూడా లబ్దిగానే ప్రభుత్వం చెబుతోంది. వరి పండించే రైతులకు రూ.27,028 కోట్లు, ఇతర పంటలకు రూ.5,964 కోట్లతో గిట్టుబాటు ధర కల్పించామని చెబుతోంది. రైతులు కష్టపడి పండించిన పంటను… గిట్టుబాటు ధరతో కొనుగోలు చేయడం కూడా లబ్దిగానే ప్రభుత్వం చెబుతోంది. అంటే… వారి శ్రమ కూడా ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకం అన్నమాట. అలాగే్ సున్నా వడ్డీ పథకం కింద 1,261కోట్లు, ఉచిత పంటల బీమా పథకం కింద రూ.4,113.70 కోట్లు చెల్లించామని ప్రభుత్వం చెబుతోంది. ఈ బీమా పథకం.. కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమా యోజన పథకం. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఖాతాలో వేసేసిన మరో లబ్ది… పగటి పూట తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా కోసం రూ.17,430 కోట్లు, నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చేపట్టిన అభివృద్ధి పనులకు రూ.1,700 కోట్లను ఖర్చు చేయడం. విద్యుత్ సంస్థలు తమ మౌలిక సదుపాయాలు పెంచుకుంటే..దానికి రైతుకు లబ్ది చేకూర్చినట్లుగా చెప్పడం మరో వింత.