అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతుంది..? ఏదీ అభివృద్ధి అని ప్రశ్నిస్తున్న వారికి ఏపీ సర్కార్ దిమ్మతిరిగి..మైండ్ బ్లాంక్ అయ్యే సమాధానం ఇచ్చింది. తాము ఏమి చేస్తున్నామో.. అదే అభివృద్ధి అని సూత్రీకరిచింది. ముఖ్యమంత్రి జగన్ ఒక్క రోజు అసెంబ్లీలో అభివృద్ధికి ఓ సింపుల్ నిర్వచించారు. నిన్నటి కంటే ఈ రోజు బాగుంటే అదే అభివృద్ధి అని తేల్చేశారు. ఏం బాగుండాలి..? ఎలా బాగుండాలి…? ఎవరు బాగుండాలి..? అన్నదానిపై స్పష్టత లేదు … కానీ ఆయన ఉద్దేశాలు మొత్తాన్ని వైసీపీ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లడంప్రారంభించారు. నిన్నటికంటే నేడు బాగుండాలి అంటే… పథకాలు అందడమేనట. అభివృద్ధి అంటే పథకాలు అందడమేనట.
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించిన డబ్బులు .. అకౌంట్లో పడితే అదే అభివృద్ధి అని వైసీపీ నేతలు సూత్రీకరిస్తున్నారు. అంతకు మించి ఏమీ చేయడం లేదు కాబట్టి.. అదే చెప్పుకుంటున్నారు. తాము అమలు చేసే నగదు బదిలీ పథకాల వల్ల… ప్రజల వద్ద డబ్బు చేరుతోందని..దానిని వారు కుటుంబ అభివృద్ధికి ఖర్చు పెట్టుకుంటున్నారని.. అంత కంటే అభివృద్ధి ఏముంటుందన్నది వైసీపీ నేతల లాజిక్. అంత వరకూ బాగానే ఉంది కానీ..వైసీపీ మార్క్ అభివృద్ధి పేరుతో ప్రజల వద్ద నుంచి పన్నుల రూపంలో లాగేస్తున్న సొమ్ము ద్వారా వారు మరింత వెనక్కి పోతున్నారు కదా.. అని వస్తున్న ప్రశ్నలకు మాత్రం వైసీపీ నుంచి సమాధానం లేదు. రెండేళ్ల కిందట మధ్యం ఆదాయం.. రూ .ఆరు వేల కోట్లు. ఇవాళ అది రూ. ఇరవై వేల కోట్లు. అంటే ప్రజల నుంచి ఒక్క మద్యం ద్వారానే రూ. పధ్నాలుగు వేల కోట్లు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇక పెట్రోల్, డీజిల్ సహా… పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే.. జీవన వ్యయం చాలా ఎక్కువ అయిపోయింది. అదంతా ప్రజల్ని పేదలను చేస్తోంది. మరి ఇదేలాంటి అభివృద్ధో చెప్పడానికి వైసీపీ నేతలు సాహసించడం లేదు.
అభివృద్ధి అంటే… అన్నం వండి నోట్లో పెట్టడం కాదు.. ప్రజలకు ఉపాధి మార్గాలు చూపించడం. వారి పని వారు చేసుకుని.. వారి సంపాదన వారు సంపాదించుకుని.. వారి తిండి వారే తినడం.. అభివృద్ధి అంటారని ఇప్పటి వరకూ.. ఆర్థిక శాస్త్ర పాఠాలు చెప్పాయి. అందుకే ప్రభుత్వాలు అభివృద్ధి పనుల కోసం పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి… ఉపాధి కల్పించడంతో పాటు… వాటి ద్వారా రైతులకు.. ఇతర వర్గాలకు నీళ్లు లాంటి వసతులు కల్పించి వారు కూడా.. బాగుపడేలా చేస్తూంటారు. అలాంటి అభివృద్ధి పనులు దీర్ఖ కాలంలో కుటుంబాలను ఆర్థికంగా నిలబెడుతూ ఉంటాయి. కానీ నగదు బదిలీ పథకాల వల్ల ఏమి జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అభివృద్ది చేయడం లేదని విమర్సలు చేస్తున్న విపక్షాలకు ప్రభుత్వం.. తాము చేసేదే.. తాము అమలు చేసే పథకాలే అభివృద్ధి అని కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఎందుకంటే రెండేళ్లలో ఏపీ సర్కార్ చేపట్టిన ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని లేదు. శరవేగంగా సాగుతూ వచ్చిన పోలవరం పడకేసింది. పరిశ్రమలు రాలేదు. నిరుద్యోగ రేటు పెరిగిపోతోంది. చివరికి ఏపీ సర్కార్ ఆదాయం కూడా పడిపోయింది.అందుకే.. అభివృద్ధికి ప్రచార కౌంటర్ ప్రారంభించింది వైసీపీ.