ఆనందయ్య కరోనాకు మందు ఇస్తున్నారని.. అది పని చేస్తుందని ఓ మాదిరి ప్రచారం ఊపందుకోగానే… ఓ సారి ప్రయత్నిద్దామని వేలల్లో అక్కడ వాలిపోయారు. సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం.. ఉచితంగా మందు ఇస్తూండటంతో… కొంత మంది విపరీతంగా ప్రచారం చేశారు. దాంతోప్రభుత్వం ఆ మందు పంపిణీని నిలిపివేసింది. అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగారు. ఆనందయ్యను ఆజ్ఞాతంలోకి తీసుకెళ్లారు., ఇప్పటికి వారం అవుతోంది. అప్పట్నుంచి ఇదిగో పంపిణీ చేస్తున్నాం.. అదిగో పంపిణీ చేస్తున్నం అని కొన్ని వర్గాల మీడియా ద్వారా పుకార్లు పుట్టిస్తున్నారు. రేపట్నుంచే పంపిణీ అని ప్రచారం చేస్తున్నారు. కానీ ఏ రోజుకారోజు వాయిదా వేస్తూ పోతున్నారు.
ఓ వైపు ఓ వర్గం మీడియాలో ఆ మందు నాటు మందు అనే ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. మరో వైపు ఆ మందు వాడిన వారిలో ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేవని ప్రచారం ప్రారంభించారు. మరి ఎందుకు పంపిణీ చేయడం లేదంటే… ఐసీఎంఆర్ దగ్గర్నుంచి ఆయుష్ వరకూ అనేక రకాల కారణాలు చెప్పడం ప్రారంభించారు. ఆనందయ్య మందు తయారీకి వాడుతున్నవన్నీ… రోజు వారీగా వంటల్లో వాడే సామాగ్రినే. అవేమీ హానికరం కాదు., అదే విషయాన్ని అధికారికంగా ఆయుష్ శాఖ కూడా చెప్పింది. మరి పంపిణీకి ఎలాంటి అడ్డంకులు ఉన్నాయో ఎవరికీ తెలియడం లేదు. ఇప్పటికి మూడు కమిటీలు మందును పరిశీలించాయని..మరో మూడు, నాలుగు కమిటీలు పరిశీలించిన తర్వాత ఆమోద ముద్ర వేసిన తర్వాత ప్రభుత్వమే పంపిణీ చేస్తుందని… కొంత మంది చెబుతున్నారు.
మరో వైపు.. ఆనందయ్య మందు పేరిట… నెల్లూరులోని సీవీఆర్ కాలేజీ ప్రాంగణంలో తయారీ జరిగిపోతోందని చెబుతున్నారు. ఆ మందు అంతా ఎవరికి పంపిణీ చేస్తున్నారో ఎవరికీ తెలియదు. కానీ కృష్ణపట్నం చుట్టుపక్కల బ్లాక్‌లో .. .కనీసం రూ. పదివేలకు మందును అమ్ముతూ చాలా మంది దొరికిపోతున్నారు. దాన్ని ఎక్కడ తయారు చేస్తున్నారు.. ఎవరు చేస్తున్నారన్న దానిపై క్లారిటీ లేదు. కానీ బాగా పని చేస్తుందన్న పిచ్చి నమ్మకంతో చాలా మంది ఐసీయూల నుంచి కూడా వచ్చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తుతోంది.
మరో వైపు ఆనందయ్య ఆచూకీ కనిపించడం లేదు. పోలీసులు రెండు కేసులు అయితే పెట్టారు. ఆ తర్వాత ఆయన వైసీపీ నేతల అధీనంలో ఉన్నారా.. లేక పోలీసుల అధీనంలో ఉన్నారా అన్నదానిపై స్పష్టత లేదు. ఆయన ఆచూకీపై ఆందోళన నెలకొనడంతో .. ఓ వీడియోను రిలీజ్ చేయించారు. తాను క్వారంటైన్లో ఉన్నానని చెప్పుకొచ్చారు. వైసీపీ నేతల తెలివితేటలు అలాగే ఉంటాయని… అసలు కరోనాకు మందు కనిపెట్టిన వ్యక్తి క్వారంటైన్‌కు వెళ్లడం ఏమిటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఆనందయ్య చుట్టూ ఏదో తెలియని రాజకీయం.. వ్యాపారం మాత్రం నడుస్తోందని అంటున్నారు.