సినిమా సినిమాకీ మధ్య గ్యాప్ తీసుకోవడం, ఓ సినిమా పూర్తయిన తరవాతే మరో సినిమా గురించి ఆలోచించడం బోయపాటి శ్రీనుకి అలవాటు. కానీ… ఇప్పుడా పరిస్థితి లేదు. హీరోల్ని లైన్ లో పెట్టడం చాలా కష్టం గా మారింది. అందుకే.. ముందు నుంచీ పక్కా ప్రణాళికలతో వెళ్లాల్సిందే. బోయపాటి కూడా రూటు మార్చి, `అఖండ` చేతిలో ఉండగానే, మరో సినిమాఖాయం చేసుకునే పనిలో పడ్డాడు. ప్రస్తుతం బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో `అఖండ` రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. దీని తరవాత ఏ హీరోతో వెళ్లాలి? అనే విషయంలో ఇప్పటికే బోయపాటి లో తర్జన భర్జనలు మొదలైపోయాయి. అల్లు అర్జున్, రామ్, రవితేజ, గోపీచంద్ లాంటి హీరోల పేర్లు బయట చక్కర్లు కొడుతున్నాయి. అయితే బోయపాటి దృష్టి మాత్రం బన్నీ, రవితేజలపై ఉంది.
గీతా ఆర్ట్స్‌లో బోయపాటి ఓ సినిమా చేయాల్సివుంది. ఇది వరకే బోయపాటి అడ్వాన్స్ తీసుకున్నాడు కూడా. బన్నీ కూడా.. `సరైనోడు` తరవాత మరోసారి బోయపాటి తో జట్టు కట్టాలని ఉవ్వీళ్లూరుతున్నాడు. ఈ నేపథ్యంలోనే బోయపాటి – బన్నీమధ్య కథాచర్చలు జరిగాయి. మరోవైపు బోయపాటి రవితేజని సైతం లైన్లో పెట్టాడు. `భద్ర` తరవాత వీరిద్దరి కాంబినేషన్ సెట్టవ్వలేదు. ఈసారి ఎలాగైనా ఈ కాంబోని పక్కా చేయించుకోవాలని చూస్తున్నాడు బోయపాటి. ఇద్దరు హీరోలూ బోయపాటితో సినిమా చేయడానికి రెడీనే. కానీ.. వాళ్ల డేట్లు అందుబాటులో లేవు. `అఖండ` పూర్తయిన వెంటనే… బోయపాటికి లైన్ క్లియర్ కావడం కష్టమే. ఎందుకంటే అటు బన్నీ చేతిలో, ఇటు రవితేజ చేతిలో సినిమాలున్నాయి. అందుకే ఇద్దరు హీరోలూ.. బోయపాటిని వెయిటింగ్ లిస్టులో పెట్టేశారు. `పుష్ష` తరవాత బన్నీకి కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి బోయపాటికి ఛాన్స్ ఇస్తాడా…? అనేది చూడాలి.