విశాఖ హెచ్‌పీసీఎల్ ఓల్డ్ టెర్మినల్‌లో మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో ఎగసిపడిన మంటలు విశాఖ వాసుల్ని ఒక్క సారిగా ఉలిక్కి పడేలా చేశాయి. విశాఖ మొత్తం కనిపించేలా దాదాపుగా అర గంట పాటు ఎగసిపడిన మంటలు… దట్టింగా వ్యాపించిన పొగ.. ఏదో ఉత్పాతం జరగబోతోందన్న భయాన్ని కల్పించింది. అయితే అత్యాధునిక టెక్నాలజీ వాడి… మంటలను గంటన్నరలోనే అదుపు చేయడంలో.. హెచ్‌పీసీఎల్ సిబ్బంది సక్సెస్ అయ్యారు. అగ్నిప్రమాదం సమయంలో ఫైర్ సెన్సార్లు పని చేయడంతో కార్మికులు అలారం మోగిన వెంటనే బయటకు పరుగులు తీశారు. దీంతో.. ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదని అధికారులు ప్రకటించారు. ప్రాణ నష్టం ఏమీ లేదని కూడా స్పష్టం చేశారు.
అసలు ప్రమాదం ఎలా జరిగిందో నిపుణులు తేల్చాల్సి ఉంది. విశాఖ హెచ్‌పీసీఎల్‌కు మూడేళ్ల క్రితం కొత్త టెర్మినల్ నిర్మించారు. అయితే పాత టెర్మినల్‌లోనూ కార్యకలాపాలు జరుగుతున్నాయి. నగరం నడిబొడ్డున చాలా విశాలమైన ప్రాంతంలో ఉండే పాత టెర్మినల్ విషయంలో ఎప్పుడూ భద్రతా పరమైన సమస్యలు రాలేదు. క్రూడాయిల్‌ను అక్కడ నిల్వ చేసి శుద్ధి చేస్తారు కాబట్టి.. అత్యంత జాగ్రత్తలతో ఫైర్ సేఫ్టీని ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో మంటలు చెలరేగినా కొంత సేపట్లోనే అదుపు చేయగలిగారు. అసలు మంటలు రావడానికే చాన్స్ లేదని.. ఎలా మంటలు వచ్చాయో… తెలిస్తే కానీ ఏం జరిగిందో చెప్పలేమంటున్నారు.
హెచ్‌పీసీఎల్ ఓల్డ్ టెర్మినల్ ప్రమాదంతో ఇప్పుడు… ఆ టెర్మినల్‌ను ఇళ్ల మధ్య నుంచి తొలగించాలనే డిమాండ్ వేగం పుంజుకోనుంది. ఓల్డ్ టెర్మినల్ ఏర్పాటు చేసినప్పుడు అదంతా నిర్మానుష్య ప్రాంతమే. కానీ ఇప్పుడు అది సిటీ మధ్యలోకి వచ్చింది. అనుకోని ప్రమాదం జరిగితే.. పెద్ద ఎత్తున నష్టం ఉంటుంది. ప్రాణ నష్టం కూడా ఉంటుంది. ఇలాంటి అంచనాలతో ఇక నుంచి హెచ్‌పీసీఎల్‌ను అక్కడ్నుంచి కొత్త టెర్మినల్‌కే మార్చాలనే డిమాండ్లు ఊపందుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ విశాఖలోజరిగిన పరిశ్రమల ప్రమాదాలన్నింటిలోనూ ఇదే డిమాండ్ వినిపిస్తోంది.